ఫ్లడ్ కమిటీల ఏర్పాటుపై సర్కారు సమాలోచనలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల అనుభవాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని సమాలోచనలు చేస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల అనుభవాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని సమాలోచనలు చేస్తున్నది. రానున్న రోజుల్లోనూ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ముందస్తుగానే అప్రమత్తమయ్యేందుకు ఈ అడుగులు వేస్తున్నది. అయితే, గ్రామాలు, మండలాల వారీగా ఫ్లడ్ మేనేజ్ మెంట్ కమిటీల ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలన చేస్తున్నది. మంత్రి సీతక్క జిల్లా ములుగులో ఇది విజయవంతం అయిన నేపథ్యంలో ఈ అనుభవం ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై సర్కారు యోచన చేస్తున్నది. గ్రామాల్లో చెరువులు, వాగులు, కాలువలపై వెలసిన అక్రమ కట్టడాల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశంపై మంతనాలు జరుపుతున్నది. ఇదే విషయంపై నేడు(బుధవారం) రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరనుంది. ఈ మేరకు ఆ శాఖవర్గాలు మీడియాకు మంగళవారం వెల్లడించాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులు హజరు కానున్నట్టు తెలిపాయి. భారీ వర్షాల నేపథ్యంలో శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నట్టు వివివరించాయి. పారిశుధ్య నిర్వహణ, తాగు నీటి సరఫరా, రాకపోకల పునరుద్దరణ ప్రణాళికపై చర్చలు జరగనున్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించనున్న సమావేశం ఏర్పాటు చేసినట్టు మంత్రి కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.