Kishan Reddy: మజ్లిస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై కిషన్ రెడ్డి సీరియస్
మజ్లిస్(Majlis) ఏరియాలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మజ్లిస్(Majlis) ఏరియాలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శలు చేశారు. నాంపల్లి నియోజకవర్గం మల్లేపల్లి డివిజన్‌లోని డీ-క్లాస్‌లో కమ్యూనిటీ హాల్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంట్(Hyderabad Parliament) పరిధిలో అనేక ఏండ్లుగా మజ్లిస్(Majlis) నేతలు శాసనసభ్యులుగా, కార్పొరేటర్లు(Corporators)గా నేతృత్వం వహిస్తున్నారని, అయినా సామాన్యులకు ఎలాంటి పథకాలు అందడం లేదని విమర్శలు చేశారు. మజ్లిస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పక్షపాతంతో వ్యవహరిస్తూ ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని కిషన్ రెడ్డి(Kishan Reddy) ఫైరయ్యారు. పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతగా నాంపల్లి నియోజకవర్గ ప్రజలకు మేలు చేసేలా అనేక పనులు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ(GHMC), వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్ల సాయంతో సుమారు రూ.78 లక్షలతో కమ్యూనిటీ హాళ్లు, ఓపెన్ జిమ్స్, బోర్ వెల్స్ వంటి అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. బస్తీ నాయకులు, ప్రజలు మజ్లిస్ నేతలు వ్యవహరిస్తున్న తీరును గమనించాలని, ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఆలోచన చేయాలని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి అభివృద్ధికి సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు.