Golconda Fort: పంద్రాగస్టు వేడుకలకు సర్కార్ షెడ్యూలు
పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గోల్కొండ కోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గోల్కొండ కోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ గోల్కొండ కోటలో జరిగే వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ తదితర ప్రముఖులకు కూడా ప్రభుత్వం ఆహ్వానం అందించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఎనిమిది నెలల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు.
మరోవైపు రాష్ట్ర మంత్రులు, శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, ప్రభుత్వ విప్‌లు, పలు కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, ప్రభుత్వ సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులు ఎక్కడెక్కడ జెండా వందనంలో పాల్గొంటారో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మంత్రులంతా వారి సొంత జిల్లాలు లేదా ఇన్‌చార్జిలుగా ఉన్న జిల్లాలు లేది నియోజకవర్గానికి సమీపంలోని జిల్లా కేంద్రాల్లో జరిగే పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. గోల్కొండ కోట మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తుండగా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు తదితరులు మాత్రం ఉదయం 9.00 గంటలకే ఎగురవేసేలా షెడ్యూలు రూపొందింది. మొత్తం 32 జిల్లాల్లో (హైదరాబాద్) మినహా ఎక్కడెక్కడ ఎవరు చీఫ్ గెస్టుగా హాజరై జెండా ఎగురవేస్తారో జాబితాను చీఫ్ సెక్రెటరీ రిలీజ్ చేశారు.