Revanth Reddy: గిగ్ వర్కర్స్ పాలసీపై రాహుల్ గాంధీ లేఖ.. రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ రిప్లయ్

గిగ్ వర్కర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు.

Update: 2024-11-20 08:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గిగ్ వర్కర్ల విషయంలో ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాసిన లేఖపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. 'డియర్ రాహుల్ జీ.. మా పని తీరు అంతా మీ విజన్ నుంచి ప్రేరణ పొందింది. తెలంగాణలో కుల గణన సర్వే మిమ్మల్ని గర్వపడేలా చేయడం మాకు మరింత శక్తిని ఇస్తుంది. మీ విజన్, వాగ్ధానాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర గిగ్ వర్కర్స్ పాలసీ (Gig Workers Policy) విషయంలో అందరిని కలుపుకుని మరింత సమగ్రంగా, న్యాయబద్ధంగా, మార్గదర్శకంగా మారుస్తాం' అని బదులు ఇచ్చారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఇటీవల రాసిన లేఖను బుధవారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి జత చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ సూచన:

సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ రాస్తూ.. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన గిగ్ వర్కర్ల ముసాయిదా చట్టానికి సూచనగా తాను ఈ లేఖను రాస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల విషయంలో ముసాయిదా చట్టం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంప్రదింపులు జరపాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని, అన్ని పక్షాల అభిప్రాయాలు వినడం ద్వారా చట్టం పటిష్టంగా, ప్రభావవంతంగా, అర్థవంతంగా ఉంటుందని చెప్పారు. ఈ రంగం కోసం భవిష్యత్తు నిబంధనలను రూపొందించడంలో కూడా ఈ ప్రక్రియ సహాయపడుతుందన్నారు. ఈ సంప్రదింపు ప్రక్రియలో భాగమైనందుకు నేను సంతోషిస్తానని భవిష్యత్తు కోసం సుస్థిరమైన గిగ్ ఎకానమీని నిర్మించడంలో తెలంగాణ ముందుంటుందని నాకు నమ్మకం ఉందన్నారు.

గత దశాబ్దంలో, లక్షలాది మంది కార్మికులు గిగ్ ఎకానమీలో చేరారని గుర్తు చేశారు. తక్కున నైపుణ్యంతో ప్రవేశం దొరికి ఆదాయం సమకూర్చుకునే రంగంగా ఇది మారిందని ముఖ్యంగా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు లేనప్పుడు అనేక మందికి జీవనోపాధి చూపిస్తున్న రంగంగా ఇది నిలిచిందన్నారు. అయితే ఈ రంగంలో నిబంధనలు లేకపోవడంతో కార్మికుల దోపిడీ, రోజువారి పనిలో సామాజిక వివక్ష, అమానవీయ ప్రవర్తనతో పోరాడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం లేకపోవడంతో వారి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.

ఈ రంగంలోనికార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని గిగ్ కార్మికులను రక్షించడానికి వారికి సామాజిక భద్రతను పెంచడానికి ఒక చట్టాన్ని రూపొందించేలా కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోకు కట్టుబడి ఉందన్నారు. ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ దిశలో అనేక చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ కార్మికుల సంక్షేమానికి చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు. మీరు కూడా తెలంగాణ ప్రజలకు మా హామీని గౌరవిస్తూ, ఒక ముసాయిదా చట్టంతో ముందుకు సాగుతున్నందుకు, ఒక సూచనను అందించడానికి నేను సంతోషిస్తున్నాను. నేను ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులాల సర్వే కోసం శక్తివంతమైన ప్రజా సంప్రదింపు ప్రక్రియ నన్ను ఆకట్టుకుందని పేర్కొన్నారు. 

Tags:    

Similar News