హవర్లీ బేస్డ్ టీచర్లకు రూ.42 వేల వేతనం ఇవ్వండి : గెస్ట్ లెక్చరర్స్ వినతి
రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలల్లో హవర్లీ బేస్డ్ టీచర్లుగా పని చేస్తున్న తమకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం రూ.42 వేల జీతం అందించాలని గెస్ట్ లెక్చరర్స్ టీజేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమ్మంపల్లి ఐలన్న డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలల్లో హవర్లీ బేస్డ్ టీచర్లుగా పని చేస్తున్న తమకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం రూ.42 వేల జీతం అందించాలని గెస్ట్ లెక్చరర్స్ టీజేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమ్మంపల్లి ఐలన్న డిమాండ్ చేశారు.ఈ మేరకు కాంగ్రెస్ నేతలు మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు కిరణ్‌కుమార్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఎంపీ ఆర్.కృష్ణయ్య, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డిని శనివారం వారు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐలన్న మాట్లాడుతూ.. మోడల్ స్కూల్‌లో మాత్రమే గెస్ట్ లెక్చరర్లకు వేతనం తక్కువగా ఉందని, నెలలో సుమారు 120-130 పీరియడ్స్ బోధించినా కేవలం 100 పీరియడ్లకు మాత్రమే లెక్కించి రూ.18,200 జీతం చొప్పున ఏడాదిలో 8 నుంచి 9 నెలలకు మాత్రమే జీతం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కానీ, అన్ని గురుకులాల్లో రూ.24 వేల నుంచి రూ.37 వేల వరకు వేతనం అందిస్తున్నారని, అది కూడా 11 నెలల పాటు ఇస్తున్నారని తెలిపారు. తమకు కూడా ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 12 నెలల జీతం ఇవ్వాలని వినతిలో పేర్కొన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్లుగా నెలకు రూ.42 వేల జీతం ఇవ్వాల్సిందేనని అన్నారు. అదేవిధంగా ప్రతినెలా 5 లోపు వేతనం అందించాలని వారు డిమాండ్ చేశారు. వినతి అందజేసిన వారిలో మోడల్ కాలేజ్ గెస్ట్ టీచర్లు పాటిల్, కృష్ణయాదవ్, శేఖర్, ఏడు కొండలు, లింగస్వామి తదితరులు ఉన్నారు.