చెరువులన్నీ కార్పొరేట్ కంపెనీలకే అప్పగిస్తున్న GHMC, HMDA

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు అనేకసార్లు జీవో 168కు తూట్లు పొడిచారు.

Update: 2024-11-03 02:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు అనేకసార్లు జీవో 168కు తూట్లు పొడిచారు. నిబంధనలకు విరుద్ధంగా వాటర్ బాడీస్‌లో బడా కంపెనీలకు భవన నిర్మాణాల అనుమతులిచ్చారు. మరోవైపు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పేరుతో 3 దశల్లో 41 చెరువులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించారు. దీని కోసం జీహెచ్ఎంసీలో సీఎస్ఆర్ విభాగాన్నే ఏర్పాటు చేసి అడిషనల్ కమిషనర్ ను సైతం కేటాయించారు. చెరువుల సుందరీకరణ, అభివృద్ధి బాధ్యత జీహెచ్ఎంసీదే. కానీ నిధుల లేమి పేరుతో కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టారు. ఈ చెరువులను సదరు సంస్థలు అభివృద్ధి చేయకపోగా, చెరువును పూడ్చడం, ఆక్రమించడం వంటి పనులు చేశాయనే ఆరోపణలున్నాయి. చెరువు మధ్యలో నుంచి గోడలు కట్టడం, నిర్మాణ సంస్థకు సంబంధించిన భవనాల కోసం ఎఫ్టీఎల్ నుంచి రోడ్లు వేశారనే విమర్శలు ఉన్నాయి. చెరువులను సరిగా అభివృద్ధి చేయకుండానే ‘లేక్ వ్యూ’ పేరుతో తమ వ్యాపారాన్ని పెంచుకున్నాయి.

జీవో 168లో ఏముందంటే..

ఉమ్మడి ఆంధ్రపదేశ్ 2012లో అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జీవో 168ని జారీచేసింది. భవన నిర్మాణ అనుమతుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక సైతం అదే జీవో ప్రకారమే నడుచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవో ప్రకారం చెరువు, కుంట, శిఖం ల్యాండ్, ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని పేర్కొంది. దీంతోపాటు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్ణయించిన సరిహద్దుల ప్రకారం నిర్మాణ అనుమతులు ఇవ్వాలని పేర్కొన్నారు. మున్సిపల్ ఏరియా కానీ ప్రాంతాల్లో వాటర్ వాడీకి వంద మీటర్ల దూరం, మున్సిపల్ ఏరియా/హెచ్ఎండీఏ/జీహెచ్ఎంసీ పరిధిలో అయితే 50మీటర్ల దూరం నిర్మాణ కార్యకలాపాలను నిర్వహించాలి. పది హెక్టార్ల విస్తీర్ణానికిపైగా కలిగిన చెరువు/కుంట అయితే ఎఫ్టీఎల్ కు 30 మీటర్ల దూరం, పది హెక్టార్ల కంటే తక్కువగా ఉన్న చెరువు/కుంట/శిఖం ల్యాండ్ అయితే ఎఫ్టీఎల్ కు తొమ్మిది మీటర్ల దూరంలో నిర్మాణ కార్యకలాపాలు చేపట్టాలి. పది మీటర్ల వెడల్పు కంటే ఎక్కువగా ఉన్న కాలువ/వాగు/నాలా/వరదనీటి కాలువ అయితే నిర్ధారించిన సరిహద్దుకు 9 మీటర్ల దూరం, పది మీటర్ల వెడల్పు లోపు ఉంటే రెండు మీటర్ల దూరంలో నిర్మాణ పరమైన కార్యకలాపాలను చేపట్టాలి. కానీ మున్సిపల్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు ఇవేవి పట్టించుకోలేదు.

ఎఫ్టీఎల్ లోనే అనుమతులు

నిజాంపేట మున్సిపాలిటీ బాచుపల్లిలోని వాసవి అర్బన్‌ పేరిట చేపట్టిన బహుళ అంతస్తుల నిర్మాణాన్ని హైడ్రా, ఇరిగేషన్, మున్సిపల్‌ అధికారులు పరిశీలించారు. 17.34 ఎకరాల్లో 12 టవర్లతో 23 అంతస్తుల చొప్పున నిర్మిస్తున్న టవర్లలో 8, 9 బ్లాకులు కోమటి కుంట చెరువు ఎఫ్టీఎల్‌ పరిధిలోకి ఉన్నాయని అధికారులు తేల్చారు. ఆ మేరకు పదిహేను రోజుల్లో ఆ నిర్మాణాలను తొలగించాలని లేకపోతే తామే చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ అధికారులు సదరు వాసవిక అర్బన్ కంపెనీకి నోటీసులు జారీ చేశారు. గడువు ముగిసినా ఆ టవర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ హెచ్ఎండీఏ అధికారులు అనుమతులు జారీచేసి సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కూకట్‌పల్లిలోని కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువులకు వెళ్లాల్సిన నాలా వెడల్పు 17 నుంచి 19 మీటర్ల ఉండాల్సి ఉండగా.. దీనిని 6 నుంచి 7 మీటర్లకు వాసవి నిర్మాణ సంస్థ కుదించిందనే ఆరోపణలున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు సర్వే నంబర్లు కలుపుకుని 227.22 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన మైసమ్మ చెరువు ప్రస్తుతం కేవలం 83 ఎకరాలకు పరిమితమైంది. అందులో 60 ఎకరాల్లో మాత్రమే నీరుంది. మిగిలిన ప్రాంతం మట్టితో నిండి ఉంది. కంచె చేను మేసిందనే చందంగా మైసమ్మను చెరువును వాసవి హోమ్స్ సంస్థకు సీఎస్ఆర్ కింద అప్పగించారు. ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు చేపట్టేందుకు ఇదే నిర్మాణ సంస్థకు జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు జారీచేశారు. దీంతోపాటు ఖాజాగుడ చెరువు ఎన్ఎస్ఎల్ దివ్యశ్రీ నిర్మాణ సంస్థకు సీఎస్ఆర్ కింద సుందరీకరణ చేయడానికి అప్పగించారు. సుందరీకరణ మాటేమిటో కానీ చెరువును నామరూపాల్లేకుండా చేశారనే విమర్శలు ఉన్నాయి. చెరువు మధ్యలోనే గోడను నిర్మించారు.

హైడ్రా వర్సెస్ జీహెచ్ఎంసీ..

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పేరుతో జీహెచ్ఎంసీ మూడు దశల్లో 41 చెరువులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారులు రెండు చెరువులను సీఎస్ఆర్ కింద అప్పజెప్పారు. అయితే సీఎస్ఆర్ కింద చెరువులను నిర్మాణ రంగ సంస్థలకు ఇవ్వవద్దని హైడ్రా చెబుతున్నది. నిర్మాణ రంగంతో సంబంధంలేని బ్యాంకులు, ఫార్మా కంపెనీలు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు ఇవ్వాలని సూచిస్తున్నది. కానీ జీహెచ్ఎంసీ మాత్రం నిర్మాణ రంగ సంస్థలకు ఇవ్వడానికే మొగ్గుచూపినట్లు తెలుస్తున్నది. అయితే ఇక నుంచి ఇలా జరగగడానికి వీల్లేదని, అవసరమైతే ఈ విషయాన్ని సీఎం ద్రష్టికి తీసుకెళ్లడానికైనా సిద్ధమేనని హైడ్రా అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు సీఎస్ఆర్ చెరువులపై నిఘా పెట్టాలని హైడ్రా నిర్ణయించింది.


Similar News