KCR రాజకీయంగా పతనమయ్యే టైమొచ్చింది: గద్దర్ సంచలన కామెంట్స్

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా పతనమయ్యే టైమొచ్చిందని ప్రజా యుద్ధ నౌక గద్దర్ సంచలన కామెంట్లు చేశారు.

Update: 2023-04-26 16:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా పతనమయ్యే టైమొచ్చిందని ప్రజా యుద్ధ నౌక గద్దర్ సంచలన కామెంట్లు చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీపై ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన టీ సేవ్ దీక్షకు ఆయన హాజరై ఆయన మాట్లాడారు. షర్మిల నిరుద్యోగులు, విద్యార్థుల కోసం పోరాటం చేస్తోందన్నారు. ఉద్యోగాల కోసం లైబ్రరీల్లో పుస్తకాల కోసం వెతుక్కుంటూ, సరైన తిండి తినకుండా, ఇంటికి వెళ్లకుండా చదువుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఏ దేశంలో చూసినా యువశక్తిని వాడుకొని ఎదుగుతుంటే దేశంలో మాత్రం యువతకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని ఫైరయ్యారు. పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్లి ఓట్ల విప్లవం తీసుకురావాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి డబ్బుతోనే గెలుస్తామనే వాతావరణాన్ని తీసుకొచ్చారని, దీన్ని తిప్పికొట్టడం ప్రజలకే సాధ్యమన్నారు. యువత నిర్ణయించుకొని రాజకీయంగా ఎదగాలని కోరారు. షర్మిల రాజకీయ శక్తిగా ఎదిగింది కాబట్టే ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు.

ఉద్యోగాల కోసం పోరాడి ఆత్మబలిదానాలు చేసుకుంటే వారికి ఏం మిగిలిందని ఆయన ప్రశ్నించారు. ఇందుకోసమే తెలంగాణ కోసం కొట్లాడామా? అని గద్దర్ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కన్నీళ్లు తప్ప ఏం మిగిలాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఓట్ల యుద్ధంగా మార్చాలని ఆయన కోరారు. యువత రక్తం మీద అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దించేస్తామనే దీక్ష తీసుకోవాలని గద్దర్ పిలుపునిచ్చారు. ప్రజలకు ఓటు అనే శక్తి ఉందని, ఆ ఓటుతోనే కేసీఆర్‌ను గద్దె దింపాలని ఆయన కోరారు. గ్రామాల్లోనూ షర్మిల ఉద్యమం ప్రారంభించాలని, ఏ ప్రాంతంలో షర్మిల పోరాటం చేసినా తాను పాట పాడతానని, కిలో మీటర్ వరకూ నడిచైనా పోరాటంలో భాగమవుతానని ఆయన వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ వచ్చింది కానీ ప్రత్యేక గ్రామ తెలంగాణ మాత్రం ఏర్పాటు కాలేదని, ప్రత్యేక గ్రామ తెలంగాణ తీసుకొచ్చే బాధ్యత షర్మిలపై ఉందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News