హైదరాబాద్‌లో జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్ సమ్మిట్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జీ20 సమావేశాలకు సంబంధించి హైదరాబాద్‌లో ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో: జీ20 సమావేశాలకు సంబంధించి హైదరాబాద్‌లో ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశాలకు సంబంధించిన వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారన్నారు. జీ20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, వ్యవసాయ శాఖ మంత్రులు ఈ సమ్మిట్ లో పాల్గొంటారని ప్రకటించారు.
జీ 20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు భారతదేశం అధ్యక్షతన జరుగుతున్నాయని, 2022లో ఇండోనేషియాలో జరిగాయని, ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నాయన్నారు. తర్వాత 2024లో బ్రెజీల్ లో సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ సమావేశాలు చాలా కీలకమైనవని, ప్రపంచానికి సంబంధించిన పలు అంశాలపై దిశానిర్దేశం చేసే సమావేశాలన్నారు. భారత ప్రభుత్వం, ప్రజలు జీ20 దేశాల సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్నారని, జీ20 సమావేశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. దేశంలో, ప్రపంచంలోని ప్రజలు ఈ సమావేశాలపై ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు.
జీ 20లో భాగంగా ఇప్పటి వరకు అగ్రికల్చర్ కు సంబంధించి మూడు జీ20 వర్కింగ్ గ్రూప్ మీటింగ్స్ జరిగాయన్నారు. మొదటి సదస్సు ఇండోర్‌లో, రెండోది చండీగఢ్‌లో, మూడోది వారణాసిలో జరిగిందన్నారు. భాగ్యనగరంలో మూడు రోజుల పాటు జరిగే ఈ వ్యవసాయ మంత్రుల స్థాయి సమావేశాల్లో భారత్ తో కలిపి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కెనడా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ, యూకే, యూఎస్ఏ, యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.
అలాగే జూన్ 19 నుంచి 22 వరకు పర్యాటక రంగానికి సంబంధించి గోవాలో మంత్రుల స్థాయి మీటింగ్ ఉంటుందన్నారు. గోవాలో జరిగే సమావేశంలో ‘గోవా రోడ్ మ్యాప్’ పై నిర్ణయం తీసుకుంటామన్నారు. జీ20 టూరిజానికి సంబంధించిన మూడో సమావేశం శ్రీనగర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిందన్నారు. పాకిస్తాన్ బెదిరింపులను బేఖాతరు చేస్తూ.. శ్రీనగర్ మీటింగ్ ను విజయవంతంగా నిర్వహించుకున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు.