CM Revanth: చైనాతోనే పోటీ.. భారత్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఫ్యూచర్ సిటీ

పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు, పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

Update: 2024-08-06 16:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు, పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... ప్రపంచంలో ఇప్పుడు పోటీ చైనాతోనే అని, దానికి ప్రత్యమ్నాయంగా రాష్ట్రం ఎదగడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం నేతృత్వంలోని తెలంగాణ బృందానికి అక్కడి భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం చొరవ తీసుకుని దాదాపు ఇరవై కంపెనీల సీఈఓలతో న్యూయార్క్‌ నగరంలో సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తన ప్రసంగంలో తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరించారు. పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకు తెలంగాణ స్వర్గధామమని, కొత్త ఇండస్ట్రియల్ పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకొస్తుందన్నారు.

హైదరాబాద్‌ సిటీకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, శివారు ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ (హైదరాబాద్ 4.0)ని నిర్మిస్తున్నామని, పెట్టుబడులకు భారత్‌లోనే ఇది కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుందన్నారు. దేశ భవిష్యత్తుకు ఇది లాండ్ మార్కుగా ఉంటుందన్నారు. పరిశ్రమలను స్థాపించడానికి అమెరికాలో ఎన్ని అవకాశాలున్నాయో తెలంగాణలోనూ దానికి తక్కువేమీ లేవని నొక్కిచెప్పిన సీఎం రేవంత్... పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా కొత్త పాలసీ త్వరలోనే వినియోగంలోకి వస్తుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం ఫార్మా, లైఫ్ సైన్సెస్, వ్యాక్సిన్, ఐటీ, టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ తదితర రంగాలకు హబ్‌గా ఉన్నదని, ఏరో స్పేస్, డిఫెన్సు రంగాలకూ అనువైనదిగా ఉన్నదని వివరించారు. ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియలిస్టులకు వరంగా మారుతుందని, వారికి సిరుల పంట పండిస్తుందన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంతో పాటు మెడికల్ టూరిజం, ఫార్మా విలేజ్, స్పోర్ట్స్ తదితరాలు కూడా వృద్ధి చెందుతున్నాయన్నారు. సరికొత్త ఆలోచనలతో రూపొందే ఇండస్ట్రియల్ పాలసీ ఫారిన్ ఇన్వెస్టర్లకు ప్రయోజనంగా ఉంటుందన్నారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ, బయోటెక్, షిప్పింగ్ రంగాల్లో పేరొందిన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఛైర్‌పర్సన్‌లు, సీఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రాన్ని పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి, అభివృద్ధి చేసేందుకు రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలపై, తెలంగాణ చరిత్రపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రదర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వెల్లడించిన సీఎం... తన మనసులోని మాటనూ చెప్పి వారిని ఉత్సాహపరిచారు. ముఖ్యమంత్రి హోదాలో అమెరికాలో ఇది తన మొదటి పర్యటన అని, ఇక్కడి నుంచి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు సొంత రాష్ట్రానికి తీసుకెళ్లాలలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు.

ఇప్పటికే సాఫ్ట్‌ వేర్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లోనూ బలమైన పునాదులు వేసుకున్నదన్నారు. కోవిడ్‌ను అధిగమించేందుకు మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్‌లను తయారు చేసి ప్రపంచం నలుమూలలకూ అందించిందన్నారు. తెలంగాణలో సంతృప్తికరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అద్భుతమైన ప్రతిభ సంపత్తి కూడా సిద్ధంగా ఉన్నదన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే ఇన్వెస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమమైన మద్దతును అందిస్తుందని ప్రకటించారు. నిజాంలు నిర్మించిన 425 సంవత్సరాల పురాతన హైదరాబాద్ సిటీ ఇంచుమించుగా అమెరికాతో సమకాలీనంగా ఉండటం ఆసక్తికరమన్నారు. ఒకసారి తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని అనుకూలతలతో అవకాశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కలిసికట్టుగా భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

చైనాకు ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి దార్శనికతను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రపంచంలోనే టాప్ టెన్ సిటీల్లో ఒకటిగా హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేస్తామని, ఆ దిశగా రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ కంపెనీలు, వాటి ప్రతినిధులు వీరే :

• కార్నింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్క్లీరెన్

• కేకేఆర్ పార్టనర్ దినేష్ పలివాల్

• సిగ్నా ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ హెడ్ ఎక్రమ్ సర్పర్

• న్యూజెర్సీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బిల్ నూనన్

• సేఫ్‌సీ గ్రూప్ ఛైర్మన్ ఎస్వీ అంచన్

• టిల్మాన్ హోల్డింగ్స్ ఛైర్మన్ సంజీవ్ అహుజా

• అమ్నీల్ ఫార్మా కో సీఈవో చింటూ పటేల్

• జేపీ మోర్గాన్ చేజ్ ఈడీ రవి లోచన్ పోలా

• ఆక్వాటెక్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) సుబ్బారావు

• యాక్సెంచూర్ ఎండీ అమిత్కుమార్

• డెలాయిట్ ఎండీ పునిత్ లోచన్

• హాబిట్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వీర బుద్ధి

• బీఎన్‌వై మెల్లన్ ఎండీ అట్లూరి

• పేస్ యూనివర్సిటీ డీన్ డా. జోనాథన్ హిల్

• అకుజెన్ చీఫ్ సైంటిఫిక్ హెడ్ అరుణ్ ఉపాధ్యాయ

• ఎస్ అండ్ పీ గ్లోబల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్వామి కొచ్చెర్లకోట

• ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ ఎండీ అశ్విని పన్సే

ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‌కు ట్రైజిన్ ప్లాన్

అమెరికాకు చెందిన ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇన్నోవేషన్ సెంటర్‌ను నెలకొల్పడానికి ముందుకొచ్చింది. ఆరు నెలల్లోనే కార్యకలాపాలను ప్రారంభించేలా పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు రూపొందించుకున్నది. ఇప్పటికే వంద మంది ఉద్యోగులు పనిచేస్తుండగా త్వరలోనే మరో వెయ్యి మంది భారతీయులకు, ఇంకో 1500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు అవగాహనా ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. ఈ ఇన్నోవేషన్ కమ్ డెలివరీ సెంటర్ ఏర్పాటుతో రాబోయే మూడేండ్లలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందిస్తామని పేర్కొన్నారు. ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించి డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే సొల్యూషన్స్ ను అందించనున్నట్లు ప్రతినిధులు ప్రకటించారు. రెండు దశాబ్దాలకు పైగా ఐక్య రాజ్య సమితితో పాటు అనుబంధ విభాగాలకు సాంకేతిక భాగస్వామిగా (టెక్నాలజీ పార్టనర్) వ్యవహరించామని, గతేడాది నుంచి అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వినియోగంతో పాటు ఫలితాలపై విశ్లేషణలు చేస్తున్నామన్నారు. అన్ని రంగాలకూ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడేలా రీసెర్చి డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టామన్నారు.

హైదరాబాద్‌కు విస్తరించనున్న ఆర్సీషియం

టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్ రంగాల్లో పేరొందిన ఆర్సీషియం కంపెనీ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరింపజేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. అమెరికాలో పర్యటనలో ఉన్న తెలంగాణ టీమ్‌తో ఆర్సీషియం సీఈవో గౌరవ్ సూరి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అమెరికా తర్వాత ఇతర దేశాల్లో మొదటిసారిగా యూనిట్‌ను పెడుతున్నది హైదరాబాద్ నగరంలోనే అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తమ కంపెనీ అందిస్తున్న సర్వీసులకు ఇకపైన హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందన్నారు. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనున్నట్లు తెలిపారు. డేటా మేనేజ్మెంట్, డేటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఆర్సీషియంకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని గుర్తుచేశారు. హైదరాబాద్ ఆఫీసు విస్తరణతో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని సీఎం రేవంత్ ఈ చర్చల సందర్భంగా ఆర్సీషియం ప్రతినిధులకు స్పష్టంచేశారు. ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ఈ కంపెనీ విస్తరణతో బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు హైదరాబాద్ కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబెడుతుందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, సాంకేతికాభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రపంచస్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యమున్న మానవ వనరులున్నందున హైదరాబాద్‌ను తమ కంపెనీ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్‌కు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు కంపెనీ సీఈవో గౌరవ్ సూరీ తెలిపారు.

2-జీ బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు :

బయో ఫ్యూయల్స్ తయారీ సంస్థ ‘స్వచ్ఛ్ బయో’ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. త్వరలోనే సెకండ్ జనరేషన్ సెల్యులోజిక్ బయో ఫ్యూయల్ ప్లాంట్‌ను నెలకొల్పనున్నది. మొదటి దశలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో 250 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇవ్వనున్నది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధస్‌బాబుతో పాటు తెలంగాణ అధికార ప్రతినిధి బృందంతో స్వచ్ఛ్ బయో ఛైర్‌పర్సన్ ప్రవీణ్ పరిపాటి చర్చలు జరిపారు. పెట్టుబడులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ వికేంద్రీకృత అభివృద్ధి దృక్పథం తమను ఆకట్టుకుందని కంపెనీ ఛైర్మన్ ప్రవీణ్ పరిపాటి వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో మరిన్నిప్లాంట్లు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బయో ఫ్యూయల్స్ హబ్‌గా మార్చాలనే ఆలోచనలను పంచుకున్నారు.

సంకల్పబలానికి వైకల్యం అడ్డుకాదు : సీఎం రేవంత్

జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా సంకల్పాన్ని సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న న్యూయార్క్‌ లోని భారత అంధ బాలుర క్రికెట్ జట్టును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. అమెరికా పర్యటనలో పరిశ్రమాధిపతులతో సమావేశాల్లో బిజీగా గడుపుతున్నప్పటికీ అంధ బాలుల క్రికెట్ జట్టు సభ్యులతో సమయం తీసుకుని ముచ్చటించారు. కలుసుకునే అవకాశం రావటం అమూల్యమైనదని వ్యాఖ్యానించారు. ఈ టీమ్ ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ఎన్ని అడ్డంకులున్నా ఎదిరించి నిలబడాలనే మానసిక స్థయిర్యాన్ని వాళ్ల నుంచి నేర్చుకోవాలని అన్నారు. వారితో అప్యాయంగా మాట్లాడిన సీఎం రేవంత్... క్రికెట్ జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News