తెలంగాణ ఎన్నికల వేళ ప్రచార వాహనాలకు ఫుల్ డిమాండ్.. ఎక్కువ బుకింగ్‌లు ఆ పార్టీ నుంచే..
తెలంగాణ ఎన్నికలకు వచ్చే నెలలో సీఈసీ షెడ్యూల్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలకు వచ్చే నెలలో సీఈసీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రచార రథాలను సైతం సిద్దం చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల నేతలందరూ ఇప్పటికే ప్రచార రథాల కొనుగోలుకు ఆర్డర్‌లు ఇస్తున్నారు. స్పీకర్లు, ఎల్‌ఈడీ లైట్లు ఉండేలా అధునాతన ఫీచర్లతో తమకు నచ్చిన డిజైన్లలో ప్రచార వాహనాలను తయారుచేయించుకుంటున్నారు.
ప్రచారం వాహనాల కోసం లక్షల్లో పార్టీల నేతలు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు ప్రచార రథం, ఇతర ఖర్చుల కోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. కొంతమంది ప్రచార రథాలను కొనుగోలు చేస్తుండగా.. మరికొంతమంది అద్దెకు తెచ్చుకుంటున్నారు. అద్దెకు తెచ్చుకునే వెహికల్స్‌కు తమ పార్టీ రంగు, సింబల్‌కు తగ్గట్లు మార్పులు చేయించుకుంటున్నారు. నెలవారీగా చెల్లించి అద్దెకు తెచ్చుకుంటున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వీటిని ఎక్కువగా తెప్పించుకుంటున్నారు. గడిచిన కొద్దిరోజుల్లో ప్రచార వాహనాల ఆర్డర్లు పెరిగినట్లు తయారీ సంస్థలు చెబుతున్నాయి. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి కాకుండా బీజేపీ నేతల నుంచి ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు చెబుతున్నారు.
గడిచిన 15 రోజుల్లో ఒక సంస్థకు బీఆర్ఎస్ నేతల నుంచి 25, కాంగ్రెస్ నేతల నుంచి 20 ఆర్డర్లు రాగా.. బీజేపీ నేతల నుంచి ఏకంగా 60 బుకింగ్‌లు వచ్చినట్లు ఓ సరఫరాదారుడు తెలిపాడు. బీజేపీ నుంచి ఎక్కువ బుకింగ్‌లు రావడం ఆశ్చర్యం కల్గిస్తోందని అంటున్నాడు. బీఆర్ఎస్ ఎక్కువమంది సిట్టింగ్‌లకే టికెట్లు కేటాయించింది. దీంతో ఇప్పటికే కొంతమందికి ప్రచార వాహనాలు కలిగి ఉండటంతో తక్కువ ఆర్డర్‌లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత డిమాండ్ పెరుగుతుంది గనుక కొంతమంది ఆశావాహులు ముందుగానే ప్రచార వాహనాన్ని బుకింగ్ చేసుకుంటున్నారు.