పండుగ అంటే పూజలు మాత్రమే కాదు.. అలయ్ బలయ్‌లో మాజీ ఉపరాష్ట్రపతి ప్రసంగం

ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Update: 2024-10-13 09:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్​ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ముందుండి ఈ కార్యక్రమం నడిపించడం సంతోషమన్నారు. ఈ ప్రొగ్రామ్‌ను ఇలానే కంటిన్యూ చేసి భావి తరలకు అందించాలని అన్నారు.

పండుగలకు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ప్రాముఖ్యత కూడా ఉందన్నారు. పండుగ అంటే పూజలు, ఆరాధన మాత్రమే కాదని, పండుగ అంటే అందరూ కలిసిమెలిసి కబుర్లు చెప్పుకోవడం కూడా అని వెంకయ్య చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సోదరభావం పెరుగుతుందని, మనుషుల మధ్య సమైక్యత పెరుగుతుందన్నారు. నేటి సమాజానికి సమైక్యత అవసరం ఎంతో ఉందని, కుటుంబం, ప్రాంతం, దేశం, ప్రపంచం అనే సమైక్య భావన పెరగాలని అన్నారు. అలయ్ బలయ్ నిర్వహిస్తూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటం చాలా గొప్ప విషయమని వెంకయ్య కొనియాడారు.


Similar News