రాస్తారోకోలో చిక్కుకున్న మాజీ ఎంపీ
తాగునీటి కోసం గ్రామస్తులు రోడ్డెక్కారు.
దిశ, అశ్వారావుపేట: తాగునీటి కోసం గ్రామస్తులు రోడ్డెక్కారు. కాగా ఈ రాస్తారోకోలో మాజీ ఎంపీ చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెదవాగు ప్రాజెక్ట్, గుమ్మడవల్లి, జెట్టివారిగూడెం గ్రామాల పరిధిలో గత వారం రోజులుగా త్రాగునీరు సరఫరా కావడం లేదంటూ.. స్థానికులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తరచూ తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని.. పొరుగు గ్రామ పంచాయతీకి చెందిన సెక్రెటరీ ఇంచార్జ్‌గా వ్యవహరించడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదని ఆరోపించారు.
సమస్యను పరిష్కరించేంతవరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్ముంచుకొని కూర్చున్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. సుమారు గంటన్నరపైగా ఆందోళన కొనసాగిస్తుండడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇందులో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు వాహనం కూడా ఉంది. ఏపీలోని వేలేరుపాడు మండలంలో అగ్ని ప్రమాద బాధితుల పరామర్శకు వెళ్లి వస్తున్న మాగంటి ధర్నాలో చిక్కుకున్నారు. దీంతో ఆందోళన చేస్తున్న వారి వద్దకు వెళ్ళిన మాగంటి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు.
వెంటనే స్థానిక ఎంపీడీవో విద్యాధరరావుతో మాగంటి ఫోన్లో మాట్లాడారు. పిల్లా జల్లా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపడుతున్నారని తక్షణమే వారి సమస్య పరిష్కరించాలని కోరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు సైతం ఎంపీడీవోను ఫోన్‌లో సంప్రదించేందుకు ఫోన్లో ప్రయత్నించగా స్విచ్డ్ ఆఫ్ వచ్చినట్లుగా తెలిపారు.