తెలంగాణకు కొత్త PCC అధ్యక్షుడు.. క్లారిటీ ఇచ్చిన మధుయాష్కీ
కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను వీడేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను వీడేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ, తామే పార్టీలోకి తీసుకునేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరతకు వచ్చిన ఢోకా ఏమీ లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల వరకు తెలంగాణ పీసీసీ చీఫ్‌లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాల పేరుతో అవినీతికి పాల్పడిన ఎవరినీ విడిచిపెట్టమని హెచ్చరించారు. ఇప్పటికే మంత్రులు, అధికారులు అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకున్నారని.. ఇక మిగిలించి బీఆర్ఎస్ నేతల చిట్టా బయటకు చెప్పడమే అని కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఫామ్‌హౌజ్‌పై దాడి చేస్తే వందల కోట్లు బయటకు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో మధుయాష్కీ గౌడ్ ఘోర పరాజయం పాలయ్యారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దేవీరెడ్డి సుధీర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఓటమితో మొన్నటివరకు కాస్త సైలెంట్‌గా ఉన్న ఆయన.. ఇటీవల దూకుడు పెంచారు. బీఆర్ఎస్ నేతల విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు వార్తలు వినవస్తున్నాయి.