మంత్రి మల్లారెడ్డి మదమెక్కిన దున్నపోతు: మాజీ MP బూర ఫైర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాహువు.. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కేతువు అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఘాటు విమర్శలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాహువు.. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కేతువు అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 50 నుంచి 55 శాతం జనాభా బీసీలే ఉన్నారని, రాష్ట్రంలో 50 లక్షలకు పైగా కుటుంబాలు బీసీలే ఉన్నారన్నారు. కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే కేసీఆర్ వరకు బీసీలపై వివక్ష చూపారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక గడీల పాలనతో బీసీలపై ఉక్కుపాదం మోపారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్.. బీసీ వ్యతిరేకి అని విరుచుకుపడ్డారు. ప్రగతి భవన్‌లో ఒక్కరు కూడా బీసీ అధికారి లేరని ఫైరయ్యారు.
బీసీలకు బీజేపీ పెద్దపీట వేస్తే.. బీఆర్ఎస్‌లో పైసలు ఉన్నోళ్లకే అవకాశం ఇస్తారని విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌లో మనీ ఉంటేనే పదవి అని ఆరోపించారు. 40 ఎమ్మెల్సీల్లో కనీసం ముగ్గురు, నలుగురు కూడా బీసీలు లేరని పేర్కొన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల ఆర్థిక ములాలపై దెబ్బ కొడుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి మల్లారెడ్డి మదమెక్కిన దున్నపోతని, దున్నపోతులకు అందరూ దున్నపోతుల్లాగే కనిపిస్తారని విరుచుకుపడ్డారు.
కేంద్ర నిధులు రానివ్వకుండా కేసీఆర్ సైంధవుడిలా వ్యవహరిస్తున్నారని, అన్ని పనులకు అడ్డుపడుతున్నాడని ఘాటు విమర్శలు చేశారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు భారీగా బడ్జెట్ పెట్టి రూ.7 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. కేసీఆర్‌కు ప్రజలు బాగుపడటం ఇష్టం ఉండదని, ఆయనకు చాలా కుళ్లు అని ఫైరయ్యారు. బీఆర్ఎస్‌లో కల్వకుంట్ల కుటుంబం తప్ప మిగతా వాళ్లంతా తోలు బొమ్మలేనని విమర్శించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కోసం ఇప్పటికే నివేదికలు అందించామని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.