కోడ్ ముగియగానే సివిల్ సప్లయిని ముట్టడిస్తాం: పెద్ది సుదర్శన్ రెడ్డి

ఎన్నికల కోడ్ ముగియగానే సివిల్ సప్లయి భవన్‌ను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2024-05-28 17:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల కోడ్ ముగియగానే సివిల్ సప్లయి భవన్‌ను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సివిల్ సప్లయి శాఖలో జరిగిన అవినీతిపై అన్ని ఆధారాలు బీఆర్ఎస్ దగ్గర ఉన్నాయని, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. టెండర్ల ధర కంటే అదనంగా మిల్లర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆ వసూలు చేసిన డబ్బును వెంటనే సీజ్ చేయకుంటే ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ కుంభకోణాలపై మంత్రి ఉత్తమ్ నిజాలు మాట్లాడలేదని, దాట వేసే ధోరణిలో ఉన్నారని మండిపడ్డారు. టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ఉత్తమ్ ప్రకటించలేదని ప్రశ్నించారు.

సన్న బియ్యం టెండర్లను ఎల్జీ సంస్థ దక్కించుకున్నట్లు సివిల్ సప్లయి ఎండీ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. టెండర్ దారులు వసూలు చేసిన డబ్బును విశాఖపట్నం బ్యాంకుల్లో దాస్తున్నారని, దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఉన్నారని ఆరోపించారు. ఆ డబ్బును హైదరాబాద్ టూ వైజాగ్ టూ ఢిల్లీకి పంపిస్తున్నారన్నారు. అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సివిల్ సప్లయి వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ శాఖకు బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు.

రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతులకు లాఠీ ఛార్జ్ కాంగ్రెస్ ప్రభుత్వం గిఫ్ట్‌గా ఇచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో విత్తనాల సరఫరాపై ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీ ఛార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విత్తనాల కోసం రైతులు చెప్పులు క్యూ లైన్లలో పెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపించిన వారిని వదిలేస్తున్నారన్నారు. ఢిల్లీకి డబ్బులు ఇవ్వని వారిని డిఫాల్టర్స్ చేస్తామని మిల్లర్లను బెదిరిస్తున్నారని, రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ కట్టిన వారికి మాత్రమే క్లియరెన్స్ ఆర్డర్ ఇస్తున్నారని ఆరోపించారు. 250 కు పైగా మిల్లర్లు అదనంగా బిడ్డర్ల అకౌంట్స్ లో డబ్బులు వేశారని, విజిలెన్స్, ఏసీబీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్పందించాలని డిమాండ్ చేశారు.

కేంద్రీయ బండార్ సంస్ధ ఏకలవ్య స్కూల్స్ కు బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి డిఫాల్టర్ అయిందన్నారు. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడంతో సీఎం పేషీ నుండే సివిల్ సప్లయి అవినీతి జరిగిందని ఆరోపించారు. బీజేపీ చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉందని, ఎఫ్సీఐ కేంద్రం పరిధిలోనే ఉందన్నారు. అవినీతిపై బీజేపీ కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం అయిందని, ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు ఎఫ్.సీ.ఐ ను పిలిచి సమీక్షలు చేయడం లేదన్నారు. టెండర్లు పొడిగించకుండా వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


Similar News