'గిరిజన హక్కులను కేసీఆర్ కాలరాశారు.. వాటి కోసం పోరాడుతాం'

ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన హక్కులను కాలరాశారని, తమ హక్కుల సాధన కోసం పోరాడుతామని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు.

Update: 2023-06-09 14:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన హక్కులను కాలరాశారని, తమ హక్కుల సాధన కోసం పోరాడుతామని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం తొలి తరం గిరిజన స్వతంత్ర్య యోధుడు భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్ర నాయక్‌తో కలిసి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతున్నా పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్లో గిరిజనుల కోసం సీఎం కేసీఆర్ ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గిరిజన విద్యాలయాలు లేవని, హాస్టళ్లు ఉన్నాకనీస సదుపాయాలు కరువయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో తండాలన్నీ వెనుకబడ్డాయని ఆయన విమర్శలు చేశారు.

గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం కాకుండా రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. దీంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోయారని ధ్వజమెత్తారు. దశాబ్ది ఉత్సవాల పేరిట గిరిజన ఉత్సవాలు నిర్వహించాలని చూస్తున్నారని, కేసీఆర్ గిరిజనులకు ఏం చేశారని ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారనేది సమాధానం చెప్పాలన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని చేస్తున్నారా? డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారనా? పోడు పట్టాలు, సబ్ ప్లాన్ నిధులు ఇచ్చారని ఉత్సవాలు నిర్వహిస్తున్నారా? అనేది చెప్పాలని ప్రశ్నించారు.

తండాలను గ్రామపంచాయతీలుగా చేసింది కూడా గత ఎన్నికల్లో ఓట్ల కోసమేనని, అయితే ఈ గ్రామాలకు రెవెన్యూ అందించకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడ్డాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజన మహిళలు, యువతపై దాడులు, ఆకృత్యాలు జరుగుతుంటే కేసీఆర్ సర్కార్ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. మునుగోడు సందర్భంగా గిరిజన బంధును ప్రకటించ ఇప్పటి వరకు అమలు చేయకుండా విస్మరించారని ఆయన విమర్శలు గుప్పించారు. దేశంలో.. గిరిజనులను మోసం చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని, వారికిచ్చిన హామీలన్నీ నెరవేర్చి గిరిజనులను ఓట్లు అడగాలని ఆయన డిమాండ్ చేశారు.


Similar News