‘హిస్టరీ రిపీట్’.. BRS ఎమ్మెల్యేలు పార్టీ వీడటంపై KTR సంచలన ట్వీట్

పదేళ్లు ఏకధాటిగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్‌కు ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో

Update: 2024-06-24 04:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్లు ఏకధాటిగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్‌కు ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై పవర్ కోల్పోయిన ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా షాక్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు వరుసగా గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 ఎమ్మెల్యే స్థానాలు గెల్చుకోగా.. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గులాబీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లం, పోచారం, డాక్టర్ సంజయ్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 33కు చేరుకుంది. ఇటీవల మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం స్టేట్ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడటంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయిన కేటీఆర్.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో 2004-06లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నామని, అప్పుడు తెలంగాణ ప్రజలు తీవ్రంగా స్పందించి ఆందోళనను ఉధృతం చేయడంతో చివరికి కాంగ్రెస్ తల వంచవలసి వచ్చిందని గుర్తు చేశారు. చరిత్ర మరోసారి పునరావృతమవుతుందని కాంగ్రెస్ సర్కార్‌ను కేటీఆర్ హెచ్చరించారు. కాగా, కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొన్నారని.. అప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా..? అని నిలదీస్తున్నారు.


Similar News