బీజేపీలోకి మాజీ మంత్రి.. కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా 'బండి' ప్లాన్?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా బీజేపీ భారీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా బీజేపీ భారీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు అంశాలపై సీఎం కేసీఆర్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ప్రజలతో మమేకం అవ్వగా, సెప్టెంబర్ 17వ తేదీన తమదైన ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది బీజేపీ. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ చేస్తున్న ఓ పని ఇప్పుడు అధికార టీఆర్ఎస్ నేతలకు అంతుచిక్కకుండా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆగస్ట్ 15వ తేదీన దారుణంగా హత్యగు గురైన టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య అనంతరం ఖమ్మం జిల్లాలో పార్టీల కదలికలు ఆసక్తిగా మారాయి. కృష్ణయ్య కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు పరామర్శించడం టీఆర్ఎస్ పార్టీలో అలజడికి కారణం అవుతోందట. ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం కృష్ణయ్య ఇంటికి వెళ్లనుండటం ఉత్కంఠను రేపుతోంది. ఈ నెల 10వ తేదీన ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్లనున్నారు. తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులను ఆయన బండి సంజయ్ పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కృష్ణయ్య కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు తరచూ పరామర్శించడం ఆసక్తిని రేపుతోంది. ఈ కేసులో తమ్మినేని వీరభద్రం ఒత్తిడితో పోలీసులు సరైన రీతిలో చర్యలు తీసుకోవడం లేదని కృష్ణయ్య కుటుంబ సభ్యులు గతంలో ఆరోపించారు. అయితే, ఇటీవల తమ్మినేని వీరభద్రం తమ పార్టీ మద్దతు టీఆర్ఎస్‌కే ఉంటుందని ప్రకటించారు. దీంతో ఖమ్మం జిల్లాలో వయా కృష్ణయ్య మర్డర్ సాక్షిగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
ఖమ్మం జిల్లాపై కమలం నజర్:
తెలంగాణలో దూకుడు పెంచిన కమలం పార్టీ ఖమ్మం జిల్లాలో మరింత చురుకుగా వ్యవహరిస్తోంది. ఈ జిల్లాలో పార్టీకి బలమైన నేతలు పెద్ద సంఖ్యలో లేనప్పటికీ తన కార్యక్రమాలను మాత్రం ఆపడం లేదు. గతంలో ఇదే జిల్లాకు చెందిన బీజేపీకి చెందిన సాయి గణేష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడితే పెద్ద ఎత్తున బీజేపీ నేతలు స్పందించారు. కేంద్ర మంత్రులు హాజరై బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. తాజాగా కృష్ణయ్య విషయంలోనూ బీజేపీ ఇదే తరహా స్ట్రాటజీ అవలంభిస్తోంది. కృష్ణయ్యకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆయన మాజీ మంత్రికి అనుచరుడు. అలాగే సీపీఎంపార్టీలో నాలుగు దశాబ్దాలుగా పనిచేశాడు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి స్వయంగా బాబాయి కుమారుడు అవుతాడు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించడం ద్వారా ప్రజల్లోకి ఓ సందేశాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్ నేతల్ని ఎవరైనా చంపినా దిక్కులేదని అదే బీజేపీలో అయితే, ఇలాంటి పరిస్థితి లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. పార్టీలో ఎవరికైనా ఏదైనా జరిగితే అందరూ వాలిపోతారని అండగా నిలుస్తారనే విషయాన్ని పార్టీ శ్రేణులకు చెప్పే ప్రయత్నం బీజేపీ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
బీజేపీ గూటికి మాజీ మంత్రి?:
ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఆపసోపానాలు పడాల్సిన పరిస్థితి నెలకొని ఉందనే టాక్ వినిపిస్తోంది. మిగతా పార్టీలో గెలిచిన వారిని తమ పార్టీలోకి చేర్చుకోవడం మినహా టీఆర్ఎస్ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే, అధికార పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలు పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం చాలా కాలంగా గుప్పుమంటోంది. ముఖ్యంగా మాజీ మంత్రి తుమ్మల పార్టీ మారుతారనే ప్రచారం రోజు రోజుకూ పెరుగుతోంది. పార్టీ వీడతానంటూ వస్తున్న వార్తలను తుమ్మల ఖండిస్తున్నప్పటికీ ఆయన రాక కోసం మిగతా పార్టీలు ఆసక్తి చూపుతున్నాయనే చర్చ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ముఖ్య అనుచరుడిగా ఉన్న కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ పెద్దలు తరలి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా బీజేపీ కదలికలు ఖమ్మం టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏ నేత ఏ క్షణంలో పార్టీని వీడుతాడో అనే కొత్త టెన్షన్ గులాబీ నేతల్లో ఉందనే టాక్ తెరపైకి వస్తోంది. మరి ఈ నెల 10వ తేదీన బండి సంజయ్ టూర్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.
Also Read : కమలం గూటికి మాజీ మంత్రి? మునుగోడు ఉపఎన్నిక తర్వాత జంప్?