KCR స్టైల్లోనే పవర్ కమిషన్‌కు జగదీష్ రెడ్డి ఘాటు లేఖ

మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు’ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై వేసిన జస్టిస్

Update: 2024-06-29 16:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు’ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై వేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌కు శనివారం 8 పేజీల లేఖ రాశారు. మెయిల్‌తో పాటు పీఏతో లేఖను సబ్మీట్ చేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కమిషనే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అభిప్రాయాలు ప్రకటించడం బాధాకరం అన్నారు. ఏదైనా ఒక విషయంపైన విచారణ చేసేటప్పుడు అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ విచారించాలన్న విషయం మీకు తెలియనిది కాదన్నారు. ప్రత్యేక రాష్ట్ర అనంతరం తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్‌గఢ్‌తో అప్పటి ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు.

కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి యూనిట్‌కు రూ.3.90 విద్యుత్ కొనుగోలు చేశామని, ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విద్యుత్‌ను రూ.17 కొంటున్న పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ విషయంలో ఇరుకున పెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేశారన్నారని, ఏడు మండలాలను ఆంధ్రాకు తీసుకుని.. సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలుపుకున్నారన్నారని మండిపడ్డారు. పీజీసీఎల్‌లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్థతో విద్యుత్ ఒప్పందం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రూ.4.90 పైసలకు విద్యుత్ కొనుగోలు చేశారన్నారు. కేసీఆర్‌పై నిందలు వేద్దామని ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 17 ప్రాజెక్టులు నిర్మాణవుతున్నాయని, భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయిందన్నారు. అన్నీ అనుకూలంగా ఉన్న తర్వాతనే దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామన్నారు. బొగ్గు కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని, ప్రతి పవర్ ప్లాంట్ 10శాతం విదేశీ బొగ్గును వాడాలని రూల్ కూడా పెట్టిందన్నారు.

సింగరేణి బొగ్గు ఉండడం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా తాము ఒప్పుకోలేదన్నారు. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తక్కువ రేటుకు ఇస్తే ఏపీ ప్రభుత్వం ఎక్కువ రేటుకు ఇచ్చిందన్నారు. విద్యుత్ విచారణ కమీషన్ ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేసిందన్నారు. రాజకీయ ప్రత్యర్ధులు కక్షపూరితంగా చేసిన నిరాధార, అర్ధరహిత ఆరోపణలకు కమిషన్ ఊతమిచ్చినట్లయిందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేసిన కేసీఆర్ పేరును ప్రస్తావించకుండానే ఏదో నష్టం జరిగిందని, ఇక లెక్కగట్టడమే తరువాయి అన్న ధోరణి అవలంభించడం సబబుకాదన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో ఆరువేల కోట్ల నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఏ ఆధారాలతో వార్తను ప్రచురించారనే అంశాలన్నీ కూడా విచారణలో బాగం కావల్సిన అవసరం ఉందన్నారు.

లేకుంటే అరకొర సమాచారంతో కేవలం గత ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను బద్నాం చేయడం కోసమే విచారణ చేస్తున్నట్లు తాము భావించాల్సి వస్తుందన్నారు. విచారణ పూర్తి కాకముందే మీడియా సమావేశం నిర్వహించడం ఎంక్వయిరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. కమిషన్ చైర్మన్‌గా మీపై గౌరవం ఉందని, విచారణతో వాస్తవాలు బయటకి వస్తాయని ప్రజలకు నిజం తెలుస్తుందని సంతోషించామన్నారు. కానీ గత ప్రభుత్వంపైనా, కేసీఆర్‌పైన వ్యతిరేక భావనతో ఉన్నట్లుగా, మా రాజకీయ ప్రత్యర్థులు చేసిన వాదనలతో మీరు ఏకీభవించినట్లుగా మీ మాటల్లో స్పష్టమైందన్నారు.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి కేసీఆర్ ఒక్కరే ఒప్పందం రాసుకోలేదన్నారు. కేసీఆర్, రమణ్‌సింగ్‌ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రులుగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం జరిగిందన్నారు. విచారణ కమిషన్ సరిగా లేదని తాను లేఖ రాశానన్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే తాను విద్యుత్ విచారణ కమిషన్‌కు లేఖ రాశానన్నారు. విద్యుత్ ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాల మధ్య ఎక్కడైనా లంచం తీసుకునే అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు. లేఖ చూసిన తర్వాత విచారణ కమిషన్ చైర్మన్ మనసు మార్చుకుంటారని భావిస్తున్నామన్నారు.


Similar News