హడావిడి ఫొటో షూట్లతో ముగిసిన KCR పర్యటన.. రైతుల నుంచీ స్పందన కరువు
జిల్లాలో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పరిశీలించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు.
దిశ, బ్యూరో కరీంనగర్: జిల్లాలో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పరిశీలించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అయితే, గతంలో మాదిరిగా, హంగులు, ఆర్భాటాలు, ప్రజానీరాజనాలకు దూరంగా కేసీఆర్ పర్యటన కొనసాగింది. మరోవైపు కేసీఆర్ చేపట్టిన ఈ కార్యక్రమానికి రైతుల నుంచి కూడా స్పందన కరువైంది. ఉదయం10 గంటలకు పర్యటన ప్రారంభం కావాల్సి ఉండగా, మధ్యాహ్నం 1:30 వరకు ఆయన గ్రామానికి చేరుకోలేదు.
ఉద్యమ నేతగా, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ తమ గ్రామానికి విచ్చేస్తున్నప్పటికీ, గ్రామస్తుల నుండి ఎక్కడ పెద్దగా స్పందన కనిపించలేదు. మీడియా, బీఆర్ఎస్ నాయకుల హడావిడి తప్ప ఎవరిలోనూ పెద్దగా ఉత్సాహనం కనిపించలేదు. కనీసం పదిమంది రైతులు కూడా అక్కడ కనిపించకపోవడం.. స్థానికులు సైతం తక్కువ సంఖ్యలో ఉండటంతో ఈ పర్యటనకు రైతులు ప్రజలనుండి స్పందన లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కేసీఆర్ పొలంలో నాలుగు అడుగులేసి హడావిడి ఫొటో షూట్‌లతో పర్యటన ముగించారు. అనంతరం భోజనం ముగించుకుని మిడ్ మానేర్ సందర్శించి సిరిసిల్లలో మాట్లాడనున్నారు.