బీఆర్ఎస్‌లోకి మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు?
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్ దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్య నేతలు, జాతీయ నేతలతో సమావేశాలు నిర్వహించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్ దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్య నేతలు, జాతీయ నేతలతో సమావేశాలు నిర్వహించారు. సంక్రాంతి తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా బీఆర్ఎస్ కార్యకలాపాలను విస్తరించి, చేరికలు ప్రారంభిస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్- సీఎం కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు ఒడిశాలోని కోరాపుట్ మాజీ ఎంపీ జయరాం పాంగి సహ పెద్ద సంఖ్యలో నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ చేపట్టిన ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసేందుకు అనేక రాష్ట్రాల నుంచి కీలక నేతలు ముందు వస్తున్నట్లు సమాచారం.
1999 ఏప్రిల్ 17న జరిగిన అవిశ్వాస పరీక్షలో 13 నెలల ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చి వేసిన కాంగ్రెస్ నేత గిరిధర్ గమాంగ్ 9 సార్లు పార్లమెంటుకు ఎన్నిక కావడం గమనార్హం. కాగా, గమాంగ్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస పరీక్ష సమయంలో చివరి నిమిషంలో పార్లమెంటుకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి అప్పటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీ ఆదేశాల మేరకే 1999లో వాజ్‌పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు వెల్లడించారు. అయితే కొద్దిరోజుల్లోనే ఆయనను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తనను చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో యాక్టీవ్‌గా లేరు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఒడిశా బీఆర్‌ఎస్ బాధ్యతలను గమాంగ్ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: వైరాలో రాజకీయ వేడి.. సీపీఐకి షాక్ ఇచ్చిన విజయబాయి!