నాడు సాయన్నను విస్మరించిన కేసీఆర్! నేడు లాస్య అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. లాస్య నందిత మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వారు తెలిపారు. లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. గతేడాది ఇదే నెలలో నందిత తండ్రి స్వర్గస్తులయ్యారన్న ఆయన, ఈ ఏడాది ఇదే నెలలో నందిత మృతి అత్యంత విచారకరమని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత ఎమ్మెల్యే పట్ల కేసీఆర్ వివక్ష
దివంగత నేత, జి. సాయన్న కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదని, అప్పటి ప్రతిపక్షాలు, సాయన్న అభిమానులు ఆందోళనలు చేశారు. ఒక దళిత ఎమ్మెల్యేకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఏమిటని నిరసనలు తెలిపారు. తాజాగా సాయన్న కూతురు అయిన ఎమ్మెల్యే లాస్య ప్రమాదవశాత్తు చనిపోవడంతో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. గత కేసీఆర్ ప్రభుత్వం దళిత ఎమ్మెల్యే పట్ల వివక్ష చూపించారని.. నేడు రేవంత్ ప్రభుత్వం మాత్రం వివక్ష చూపకుండా అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.