బీసీలకు రూ. లక్ష సాయం.. బీఆర్ఎస్ కు ప్లస్సా.. మైనస్సా?

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందించే రూ.లక్ష సాయం వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి మైలేజ్ ఇవ్వడం కంటే మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Update: 2023-06-14 04:36 GMT

దిశ, పెగడపల్లి: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందించే రూ.లక్ష సాయం వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి మైలేజ్ ఇవ్వడం కంటే మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. కులవృత్తుల మీద ఆధారపడి జీవనం సాగించే వారికి రూ.లక్ష నగదు సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బీసీల్లోని ఆయా కులాల వారు లబ్ధి పొందాలని ఆశతో చూస్తున్నారు. ఈ పథకం బీసీల్లోని కొన్ని కులాలకే పరిమితం చేయడంతో తమకు కూడా సాయం అందించాల్సిందేనని మిగిలిన వారు పట్టుబడుతున్నారు. దీంతో స్థానికంగా ఉండే నాయకులకు ఇది తలనొప్పిగా మారింది. ఈ పథకం వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లు గంప గుత్తగా తీసుకొస్తుందని అనుకుంటే పరిస్థితి తలకిందులయ్యేలా ఉందని స్థానిక నేతల్లో ఆందోళన నెలకొన్నది. ప్రతి గ్రామం నుంచి కేవలం ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉండగా అప్లికేషన్స్ మాత్రం పెద్ద మొత్తంలో వస్తున్నాయి.

ఆన్ లైన్‌లో అప్లయ్ చేసుకోవడం కోసం క్యాస్ట్ ఇన్ కమ్ సర్టిఫికెట్స్ తప్పనిసరి కావడంతో జనాలు తహశీల్దార్ కార్యాలయాలు, మీసేవా కేంద్రాల్లో బారులుదీరుతున్నారు. దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆయా కార్యక్రమాల ఏర్పాట్లలో నిమగ్నమై ఉండడంతో సర్టిఫికెట్స్ జారీలో కొంత జాప్యం జరుగుతోంది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 డెడ్ లైన్ ఉండడంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెల విద్యా సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థులు సైతం ధ్రువ పత్రాల కోసం రెవెన్యూ, మీసేవా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.

ఓ పక్క పాలభిషేకం.. మరోపక్క నిరసనలు

దళితబంధు ప్రవేశ పెట్టడం ద్వారా ఆ వర్గానికి చెందిన ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం అంతే ఎత్తున బీసీలనుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. బీసీలకు అందజేస్తామన్న రూ.లక్షసాయం పథకంలో 15కులాలను మాత్రమే చేర్చడంతో మిగతా కులాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం కరీంనగర్ జిల్లాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీసీలో కొన్ని కులాలు మాత్రమే ఉన్నాయా అని, బీసీలు అంటే అంతా చులకన అంటూ ప్రభుత్వం మీద మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లాలో రామగిరి మండలంలో గౌడ కులస్తులు తాటి చెట్టు ఎక్కి తమకూ గౌడబంధు కింద రూ.10లక్షలు ఇవ్వాలని తమ నిరసనను తెలియజేశారు. ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో చేనేత బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చారు. ఇలా బీసీ వర్గానికి దగ్గర అవ్వడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టేలా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

బీఆర్ఎస్‌కు లాభామా? నష్టమా?

ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీలకు రూ.లక్ష పథకం వల్ల ఆ పార్టీకి లాభం కన్నా నష్టమే జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో బీసీల్లోని ఇతర వర్గాలు తమకు లబ్ది చేయాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ప్రభుత్వం అర్హులైన బీసీలందరికీ లబ్ది చేకూర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు.

ప్రజల తాకిడి ఎక్కువైంది

రూ.లక్ష సాయం ఆన్ లైన్ మొదలైన నాటినుంచి జనాల తాకిడి ఎక్కువైంది. విద్యార్థులు, రైతులు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. ఈ క్రమంలో వెబ్ సైట్ సైతం మోరాయిస్తోంది. దరఖాస్తుదారులు ఎక్కువ అవ్వడంతో సమయానికి సేవలు అందించడం ఇబ్బందిగా మారుతోంది. - రామకృష్ణారావు, మీ సేవా నిర్వాహకుడు

దరఖాస్తు గడువు పెంచాలి..

నేను వడ్రంగి పని చేసుకుంటూ బతుకుతున్న. ప్రభుత్వం ఇచ్చే లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కులం, ఆదాయం సర్టిఫికెట్ రావడానికి నాలుగు రోజులు పట్టింది. ఆన్ లైన్‌లో దరఖాస్తు చెద్ధమంటే సైట్ ప్రాబ్లెమ్ ఉంటుంది. గడువు దగ్గర పడుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం గడువు తేదీని పెంచాలి.
- గంగాధర్, దరఖాస్తుదారు, బతికేపల్లి

Tags:    

Similar News