అహ్మదాబాద్ కు రేపు ఫుడ్స్ చైర్మన్ బృందం.. ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్

అహ్మదాబాద్ రెండ్రోజుల పర్యటనకు ఫుడ్స్ చైర్మన్ తో పాటు అధికారుల బృందం రేపు (శుక్రవారం) బయల్దేరి వెళ్తుంది.

Update: 2023-07-13 13:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అహ్మదాబాద్ రెండ్రోజుల పర్యటనకు ఫుడ్స్ చైర్మన్ తో పాటు అధికారుల బృందం రేపు (శుక్రవారం) బయల్దేరి వెళ్తుంది. బాలామృతం, ఆధునిక యంత్రాలపై అధ్యయనం చేయనున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. ఆధునాతన యంత్రాలు, నూతన టెక్నాలజీతో బాలామృతం, పిల్లలకు స్నాక్స్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీ మరింత పోషక విలువలు కలిగిన ఆహారం, విద్యుత్ ఆదా చేసి ఖర్చులు తగ్గించేందుకు నడుం బిగించిందన్నారు. ఇందుకోసం అహ్మదాబాద్ లో ఈ నెల 14, 15 తేదీల్లో పర్యటించేందుకు జీఎం విజయలక్ష్మి, ఏజీఎంలు శ్రీనివాస్ నాయక్, ఎలమందల అధికారులతో వెళ్తున్నట్లు వెల్లడించారు.

ఆధునాతన సాంకేతికతో ఇతర రాష్ట్రాలకు బాలామృతం సరఫరా చేసే స్థాయికి తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీ చేరుకుందన్నారు. మరింత మెరుగైన ఉత్పత్తుల కోసమే అహ్మదాబాద్ కు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం అహ్మదాబాద్ లోని అమూల్ ఫ్యాక్టరీని సందర్శించి అక్కడ ఉత్పత్తుల్లో వినియోగిస్తున్న పదార్ధాల వివరాలను తెలుసుకోనున్నామని, రెండవ రోజు(శనివారం) ఇండోర్ ను సందర్శించి అక్కడ యంత్రీకరణ గురించి తెలుసుకోనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఉన్న ఆధునాతన యంత్రాలకు తోడు విద్యుత్ ఆదాకు, ఖర్చులు తగ్గించేందుకు అక్కడ వినియోగిస్తున్న సాంకేతిక, యంత్రాలను పరిశీలించనున్నట్లు వివరించారు. అధ్యయనం చేసిన వివరాలను తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపారు. సమావేశంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Tags:    

Similar News