ఎన్టీఆర్ హయాంలోనే పేదలకు ఆహారభద్రత

రూ. 2 కిలోల బియ్యం పథకానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టి ఆనాడే ఆహారభద్రతకు నాందిపలికారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు.

Update: 2023-05-08 14:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి పేదవాడు కడునిండా భోజనం చేయడానికి రూ. 2 కిలోల బియ్యం పథకానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టి ఆనాడే ఆహారభద్రతకు నాందిపలికారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్టీఆర్ పెనుమార్పులు తెచ్చారని అన్నారు. ఎన్టీఆర్ శతజయంతిలో భాగంగా హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ సమీపంలోని ఓ పంక్షన్ హాల్‌లో సోమవారం సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడు నిర్వహించారు. పార్టీ జెండానే సినీ హీరో బాలకృష్ణ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వల్లే పేదల జీవితాల్లో మార్పు వచ్చిందని, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో ఎన్టీఆర్ తర్వాత మాజీ సీఎం చంద్రబాబు టీడీపీని ముందుకు నడిపించారని కొనియాడారు. చంద్రబాబు ఐటీ అభివృద్ధి చేయటం వల్లే పేదల పిల్లలు లక్షలు సంపాదిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలన వల్లే హైదరాబాద్ ఆదాయం పెరిగిందన్నారు. ప్రతి పేద కుటుంబాన్ని కోటీశ్వరులను చేయడమే చంద్రబాబు కల అని పేర్కొన్నారు. స్థానిక సమస్యలను శ్రేణులు అవగాహన చేసుకొని తీర్మానం చేసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేసిన ఎన్టీఆర్‌కు కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోట్లాదిమంది గుండెచప్పుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాసాని అధ్యక్షతన టీడీపీ సత్తా ఏమిటో చూపుదామని పిలుపు నిచ్చారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. భూమిశిస్తును రద్దు చేసిన ఘతన ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవానికి ప్రతీక అయితే చంద్రబాబు ఆత్మవిశ్వాసానికి ప్రతీక అన్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ప్రధాత ఎన్టీఆర్ అన్నారు. సామాజిక న్యాయం పునాదుల మీదనే టీడీపీ ఆవిర్భవించిందన్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇచ్చేవరకు విశ్రమించమని వెల్లడించారు. ఈ సమావేశంలో మీడియా కోఆర్డినేటర్ బియ్యని సురేష్, నాయకులు బంటు వెంకటేశ్వర్లు, సాయిబాబా, జక్కిలి ఐలయ్యయాదవ్, శ్రీపతి సతీష్, షకీలారెడ్డి, జయరాంచందర్, అశోక్ గౌడ్, కాసాని వీరేశ్, గడ్డి పద్మావతి, కాట్రగడ్డ ప్రసూన, జ్యోత్స్న, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News