బీజేపీ ఎంపీలకు అగ్ని పరీక్షలా వరద సాయం నిధులు

రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అనేక చోట్ల పంట నష్టం జరిగింది. రోడ్లు, బ్రిడ్జీలు, రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి.

Update: 2024-09-03 03:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అనేక చోట్ల పంట నష్టం జరిగింది. రోడ్లు, బ్రిడ్జీలు, రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. భోజనం అందక, విద్యుత్ సరఫరా లేక జనం అల్లాడిపోతున్నారు. అయితే ఈ వర్షాలు బీజేపీ ఎంపీలకు అగ్ని పరీక్షగా మారాయి. ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగినా కేంద్రం నుంచి వరద సాయం తెస్తారా? లేక సైలెంట్‌గా ఉంటారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలున్నారు. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వీరంతా ఎంతమేరకు వరద సాయం నిధులు తీసుకొస్తారు? ఏ మేరకు చొరవ చూపిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

స్పందించని ఎంపీలు..

భారీ వర్షాలపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ మినహా మిగతా ఎంపీలు ఎవరూ స్పందించలేదు. వరదల పరిస్థితిని బండి సంజయ్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. జేపీ నడ్డా.. కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కానీ మిగతా ఎంపీలు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతం దాదాపుగా ధ్వంసమైంది. బీజేపీ గెలిచిన స్థానాల్లో వరద ప్రభావం లేకపోవడంతో ఆ ఎంపీలంతా సైలెంట్ అయ్యారా? అనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో బీజేపీ చాలా వీక్‌గా ఉంది. ఎంపీ స్థానాలు సైతం గెలవలేదు. గెలవని ప్రాంతం గురించి మాకెందుకు ? అని వారు లైట్‌గా తీసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో వైరంగా ఉండడంతో..

గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీని దూరం పెట్టారు. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు వచ్చినా ఆయన హాజరు కాలేదు. కేసీఆర్ హయాంలో వరదలొచ్చినా క్లౌడ్ బరస్ట్ అయిందని కామ్ అయిపోయారు. ఆ సమయంలో కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రానికి నిధులు రాలేదు. ఇప్పుడా పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సీన్ మారింది. రాజకీయ విమర్శలు పక్కన పెడితే నిర్ణయాత్మక విధానాల్లో, ఇతర అంశాల్లో కేంద్రంతో సఖ్యతగా ఉండి అభివృద్ధికి నిధులు తెచ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అయితే వరద నేపథ్యంలో కేంద్రం.. తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయిస్తుంది? అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో బీజేపీ ఎంపీల కృషి ఎంతున్నది అనేది క్వశ్చన్‌గానే మిగిలింది.

ఏపీకి ఇచ్చినన్ని నిధులు వచ్చేనా ?

వరంగల్, ఖమ్మం జిల్లాలో జరిగిన వరద బీభత్సం తో దాదాపు రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇది రూ.15 వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ వరద బీభత్సం సృష్టించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఏపీకి ఎన్ని నిధులు ఇస్తారు? తెలంగాణకు ఎన్ని ఇస్తారనే చర్చ జరుగుతోంది. తెలంగాణకు నిధులిస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అవ్వడంతో పాటు వీక్‌గా ఉన్న జిల్లాల్లో స్థానిక లీడర్ల ఎదుగుదలతో పార్టీ బలోపేతానికి దోహదపడనుంది. ఒక వేళ కేటాయించకుంటే కాషాయ పార్టీకి అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నుంచి విమర్శలు తప్పవనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది. మరి కేంద్ర ప్రభుత్వం.. నిధుల కేటాయింపు అంశం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.


Similar News