రాష్ట్రంలో 19 వేల జనావాసాల్లో జెండా విష్కరించాలి.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్
ఈనెల 25న నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 25న నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలు, వార్డుల్లో 25తేదీన ఉదయమే పండుగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగరవేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 19 వేల జనావాసాలలో పార్టీ జెండా ఎగరవేయాలని ఆదేశించారు. గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని ముగించుకొని, ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధులు సభ సమావేశ స్థలికి చేరుకోవాలన్నారు.
ప్రతి పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ కనీసం 3000 నుంచి 3500 మంది ప్రతినిధులతో నిర్వహించాలని, ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిని విస్తృతంగా చర్చించుకోవాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామ, వార్డు పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీల డైరెక్టర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, పురపాలికల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, పురపాలక సంఘాల చైర్ పర్సన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, సీనియర్ నాయకులంతా సమావేశాల్లో పాల్గొనేలా స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలను ఆదేశించారు.
హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు అవసరమైన భోజన, ఇతర వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుత వేసవికాలం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశాలు పార్టీ నియమించిన ఇంచార్జీలు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతుందని, జిల్లా పార్టీ అధ్యక్షులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమాలు అమలు కమిటీ ఆత్మీయ సమ్మేళనాల నివేదికను ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు అందజేస్తున్నట్లు తెలిపారు.