మెట్రోలో ప్రయాణించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి మెట్రోలో ప్రయాణించారు.

Update: 2024-09-15 11:52 GMT

దిశ వెబ్ డెస్క్ : హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి మెట్రోలో ప్రయాణించారు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన క్రమంలో ఆమె మెట్రోలో ప్రయాణం చేస్తూ ప్రయాణికులతో మాట్లాడి మెట్రో రైలు సేవలపై.. సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. మూసరంబాగ్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మేయర్ విజయ లక్ష్మి ప్రయాణించారు. ప్రయాణికులు, పిల్లల మధ్యలో కూర్చొని వారితో ముచ్చటించారు. గణేష్ నిమజ్జనం కోసం భక్తులకు స్వాగతం పలుకుతూ పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని మెట్రో అధికారులను మేయర్ కోరారు. నిమజ్జనం రోజున భక్తుల సౌకర్యార్థం ఎక్కువ సమయం వరకు మెట్రో రైలు నడపాలని, భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేయాలని మేయర్ సూచించారు. ప్రజల సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని మెట్రో అధికారులకు సూచించారు. అనంతరం దేశంలోనే తొలిసారిగా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేసిన మిట్టా ఎక్స్ లెన్స్ పాలీ హెల్త్ క్లినిక్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెట్రో ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తొలిసారిగా హెల్త్ ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. రక్త పరీక్షల డయాగ్నస్టిక్ సౌకర్యం, మెడికల్ షాప్, వైద్య నిపుణులు, ఫిజియోథెరపీ, టెలీమెడిసిన్, డెంటల్ కేర్ ఇలా అన్నీ సౌకర్యాలు మెట్రో స్టేషన్ లో ఉంటాయని వెల్లడించారు. ఆధునిక కార్పొరేట్ స్థాయి వైద్యం మెట్రో స్టేషన్లలో అందుబాటులోకి రావడం దేశంలోనే రికార్డు అని మేయర్ విజయలక్ష్మి వివరించారు.

ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ లక్షలాది మంది ప్రయాణించే మెట్రో రైళ్లలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యే ప్రయాణికులకు వెంటనే ఎమర్జెన్సీ క్లినిక్స్ ఆయా మెట్రోస్టేషన్లలో అందుబాటులోకి తీసుకు రావడం అభినందనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపుతోనే ఇది సాధ్యమైందన్నారు. మిట్టా ఎక్స్ లెన్స్ చైర్మన్ డా. మిట్టా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఎల్బీనగర్  మెట్రో స్టేషన్ లో తొలి  క్లినిక్ ప్రారంభించామని, త్వరలో మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వంద మెట్రో కేంద్రాల్లో ఆరోగ్య సేవలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన ‘ఎనీమియా ముక్త భారత్’ పిలుపులో భాగంగా తాము ఉచితంగా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయనున్నట్లు ప్రకటించారు.


Similar News