వేలిముద్రలు.. మొబైల్ సిగ్నల్స్.. 48గంటల్లోనే కేసు కొలిక్కి!
కొండగట్టు అంజన్న ఆలయంలో దోపిడీ చేసిన ముఠా పాత నేరస్థులు కావడం కూడా జగిత్యాల పోలీసులకు ప్లస్ అయింది.
దిశ, కరీంనగర్ బ్యూరో : కొండగట్టు అంజన్న ఆలయంలో దోపిడీ చేసిన ముఠా పాత నేరస్థులు కావడం కూడా జగిత్యాల పోలీసులకు ప్లస్ అయింది. గతంలో వీరికి పలు నేరాలతో సంబంధం ఉండడంతో క్లూస్ టీమ్స్ సేకరించిన వేలిముద్రల ఆధారంగా వారిని ఇట్టే గుర్తించగలిగారు. వారి పూర్వాపరాలన్ని క్రైం రికార్డ్స్ బ్యూరోలో ఉండడంతో వారి పుట్టు పూర్వోత్తరాలు సేకరించగలిగారు.
మరో వైపున టవర్ల డంప్‌తో అనుమానిత నెంబర్లను గుర్తించి వాటి ఆధారంగా రాబరీ గ్యాంగ్ ఏఏ రూట్లలో వెళ్తోంది. అన్న వివరాలు తెలుసుకున్నారు. దీంతో శనివారం వేకువ జామునే నాలుగు పోలీసు బృందాలు కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి వెళ్లాయి. మార్గమధ్యలో దోపిడీ ముఠా ఆచూకీ కోసం గాలిస్తూనే ముందుకు సాగింది.
అడ్డాల్లో సోదాలు...
బీదర్ ప్రాంతానికి చెందిన ఈ ముఠా సభ్యుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి జగిత్యాల పోలీసు టీమ్స్. ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్న క్రమంలో వారి ఆచూకీ మాత్రం దొరకడం లేదని విశ్వసనీయంగా తెలిసింది. నిందితుల అడ్డాలను గుర్తించి వాటిపై నిఘా వేసి సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. నాలుగు పోలీసు టీమ్స్ కో ఆర్డినేషన్ చేసుకుంటూ బీదర్ పరిసర ప్రాంతాల్లో దొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలోనే కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీకి గురైన వెండి ఆభరణాలు పోలీసులకు దొరికినట్టు తెలుస్తోంది. అయితే ముఠా సభ్యులందరిని పట్టుకోవాలన్న లక్ష్యంతో బీదర్‌లో తిరుగుతున్న పోలీసు బృందాలు తీవ్రంగా వేటాడుతున్నాయి. వారి వారి స్వస్థలాలతో పాటు సీక్రెట్ అడ్డాలను కూడా జగిత్యాల టీమ్స్ గుర్తించి సోదాలు చేస్తున్నట్టు సమాచారం.
నేడో రేపో...
కొండగట్టు దోపిడీ దొంగల ముఠా సభ్యులందరిని కూడా పోలీసులు పట్టుకునే విధంగా సాంకేతికతను వినియోగిస్తున్నట్టు సమాచారం. తమను పోలీసులు వెంటాడుతున్నారన్న విషయం గమనించిన దొంగలు మొబైల్స్ స్విచ్ఛాప్ చేసుకుని తప్పించుకుని తిరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే వారిని పట్టుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న పోలీసు బృందాలకు మొత్తం ముగ్గురు పట్టుబడగా వారిని హుటాహుటిన జగిత్యాలకు తరలిస్తున్నట్టు సమాచారం.
సీసీ ఫుటేజీలో రికార్డయిన వారిలో ఒకరితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే అంజన్న ఆలయంలోకి చొరబడి వెళ్లిన ముగ్గురిలో మరో ఇద్దరి కోసం వేట కొనసాగించిన పోలీసులు మరో దఫా కర్ణాటక వెళ్లేందుకు నిర్ణయించుకుని తిరుగు ప్రయాణం అయినట్టు సమాచారం. నిందితుల నుంచి సుమారు 8 కిలోల వరకు వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
48 గంటల్లోనే...
జగిత్యాల పోలీసులు దోపిడీ ముఠాను 48 గంటల్లోగానే ట్రేస్ చేయడం గమనార్హం. పొరుగు రాష్ట్రానికి వెళ్లి మరీ రాబరీ గ్యాంగ్‌తో పాటు చోరీకి గురైన సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. ఘటన జరిగిన 48 గంటల్లోగా పోలీసులు దొంగల ముఠాను కస్టడీలోకి తీసుకోవడంపై జగిత్యాల జిల్లా పోలీసుల సక్సెస్ అయ్యారనే చెప్పాలి.