తెలంగాణ స్ఫూర్తితో దుర్మార్గ పాలనపై పోరు: Minister Puvvada Ajay Kumar
తెలంగాణ స్ఫూర్తితో దుర్మార్గ పాలనపై కేసీఆర్ పోరు చేయనున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
దిశ, ఖమ్మం : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాట స్ఫూర్తితో దుర్మార్గ పాలనపై కేసీఆర్ పోరు చేయనున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా గుర్తిస్తూ ఈసీ గురువారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసిఆర్ మార్గదర్శకుడి పాత్ర పోషిస్తారని అన్నారు. కేసీఆర్ సమర్థ నాయకత్వంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ సత్ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ అడుగేస్తే విజయం తథ్యం అన్నారు. ఆయన గర్జిస్తే ప్రత్యర్థుల కోటలు బద్దలవుతాయని తెలిపారు. వ్యూహాలలో కేసీఆర్ దిట్ట అన్నారు. తెలంగాణ సంధించిన కేసీఆర్ అదే స్ఫూర్తితో దుర్మార్గ పాలనపై దండెత్తెనున్నట్లు తెలిపారు. ధర్మ యుద్ధానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు సాధించడం కోసం భారత్ రాష్ట్ర సమితిని కేసీఆర్ స్థాపించారని తెలిపారు. జాతి గౌరవాన్ని పెంపొందించే విధంగా రాజకీయ వ్యవస్థను మార్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. జాతీయస్థాయిలో ఒక సమర్థవంతమైన, విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థను ఏర్పాటుచేయడానికి దేశం యావత్తు కేసీఆర్‌ను ఆహ్వానిస్తోందన్నారు.