Female Aghori : కొండగట్టులో ప్రత్యక్షమైన మహిళా అఘోరీ
తెలంగాణలో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన మహిళా అఘోరీ నాగసాధువు(Female Aghori) తాజాగా కొండగట్టు(Kondagattu)లో ప్రత్యక్షమైంది.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన మహిళా అఘోరీ నాగసాధువు(Female Aghori) తాజాగా కొండగట్టు(Kondagattu)లో ప్రత్యక్షమైంది. ఇటీవల సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసంతో ఆ గుడిలో పూజలు చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన అఘోరీ(శివ బ్రహ్మ విష్ణు) అనంతరం పలు దేవాలయాలను సందర్శిస్తూ టీవీ, యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్య్వూలు ఇస్తూ వైరల్ అయ్యారు. తన స్వస్థలం మంచిర్యాల అని, తాను అఘోరీ, నాగసాధు దీక్షలను పూర్తి చేసుకుని గురువు ఆదేశాలతో సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దేశంలో పర్యటిస్తూ తెలంగాణకు వచ్చినట్లుగా చెప్పారు. కారులో పుర్రెల బొమ్మలతో ఆలయాలు తిరుగుతూ మీడియాకు ఇంటర్య్వూలు ఇస్తూ హల్ చల్ చేసింది.
ఈ క్రమంలో అసలు తను అఘోరీ కాదని, ట్రాన్స్ జెండర్ అని, పూజల పేరుతో జనాన్ని మభ్యపెట్టి డబ్బులు గడిస్తుందన్న ఆరోపణలు ఎదుర్కోంది. తనపై దుష్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సైతం చేసి సంచలనం రేపారు. అనంతరం తన గురువు తనను ఆకస్మాత్తుగా వెనక్కి రమ్మారంటూ కేధారనాధ్ వెళ్లిపోయారు. తెలంగాణలో తన వ్యవహార శైలి పట్ల గురువు మందలించారని, సనాతన ధర్మ రక్షణలో ఎలా వ్యవహరించారో బోధించారంటూ చెప్పి, మళ్ళీ అనూహ్యంగా తెలంగాణకు వచ్చిన మహిళా అఘోరీ కొండగట్టలో ప్రత్యక్షమైంది. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకుంది. తర్వాత అఘోరీ వేములవాడ, కొమురవెల్లి ఆలయాల సందర్శనకు వెళ్లింది.
నవంబర్ 1న ముత్యాలమ్మ గుడి వద్ద ఆత్మార్పణం
కాగా ఈ మహిళా అఘోరీ ఇటీవలే అక్టోబర్ 29న తాను నవంబర్ 1వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానని సంచలన ప్రకటన చేసింది. సనాతన ధర్మంపై పోరాటంలో తాను ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది. ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిని ఎందుకు వదిలేస్తున్నారు అని ప్రశ్నించింది. దాడి చేసిన వ్యక్తుల్ని తమకు అప్పగించాలని కోరింది. తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని నిరూపిస్తానని తెలిపింది. ఈ ఆత్మార్పణలో మరణం నుంచి బయటపడితే.. సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళతానని పేర్కొంది. ఒకవేళ మరణిస్తే శివయ్య దగ్గరకే వెళతా అని తెలిపింది. మొత్తం మీద ఇప్పటికే తన వ్యవహార శైలితో సంచలనం రేపిన మహిళా అఘోరీ మునుముందు ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.