ధరణి అప్లికేషన్లకు ఫాస్ట్ క్లియరెన్స్! నేటి నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్
పెండింగ్ లో ఉన్న ధరణి అప్లికేషన్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమైంది.
దిశ, తెలంగాణ బ్యూరో: పెండింగ్ లో ఉన్న ధరణి అప్లికేషన్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం మార్చి 1 నుంచి 9 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తహశీల్దార్, డీటీ, ఆర్ఐల నేతృత్వంలో మండలానికి రెండు నుంచి మూడు టీమ్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఈ టీమ్ ప్రతి దరఖాస్తును పరిశీలిస్తుంది. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్ట్ ఇస్తుంది. ప్రతి తహశీల్దార్ ఆఫీసులో అధికారులు అందుబాటులో ఉంటారు. పారాలీగల్స్, డీఆర్డీఏలో పని చేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్లు, అగ్రికల్చర్ విస్తరణాధికారులు, పంచాయతీ సెక్రటరీలను కూడా ఈ స్పెషల్ డ్రైవ్ లో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రతి దరఖాస్తుదారుడికి వాట్సాప్ ద్వారా సమాచారం
ముందుగా తహశీల్దార్లు గ్రామాలు, మాడ్యూళ్ల వారీగా జాబితాలను సిద్ధం చేసి టీమ్స్ కి అందజేస్తారు. దరఖాస్తుదారుడికి సైతం వాట్సాప్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తారు. అవసరమైతే డాక్యుమెంట్లు సేకరిస్తారు. అలాగే సేత్వార్, ఖాస్రా, సెస్సాలా పహానీ, పాత పహానీ, 1 బీ రిజిస్టర్, ధరణి డేటాను పరిశీలిస్తారు. టీమ్స్ కు అసైన్మెంట్, ఇనాం, పీవోటీ రిజిస్టర్స్, భూదాన్, వక్ఫ్, ఎండోమెంట్ ల్యాండ్ రికార్డులు వెరిఫై చేసే అధికారాన్ని కట్టబెడుతూ సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంకేమైనా సందేహాలుంటే టీమ్ సభ్యులు ఫీల్డ్ విజిట్ చేసి అప్లికేషన్లపై రిపోర్టును అథారిటీకి పంపిస్తారు. అథారిటీ ఆ రిపోర్ట్ ను ఆమోదించడం లేదా తిరస్కరిస్తున్నట్లు పేర్కొంటూ ఉన్నతాధికారులకు సమర్పిస్తుంది. కాగా, ప్రభుత్వ భూములను తప్పనిసరిగా పరిరక్షించే విధంగానే డ్రైవ్ ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తహశీల్దార్లు, ఆర్డీవోల ద్వారా కలెక్టర్లను ప్రతి రోజూ మానిటరింగ్ చేయాలని దిశానిర్దేశం చేసింది. అయితే స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం పూర్తిగా ధరణి కమిటీ డిజైన్ చేయడం గమనార్హం.
తహశీల్దార్ స్థాయి:
టీఎం4: విరాసత్(అసైన్డ్ భూములతో సహా)
టీఎం10: జీపీఏ, ఎస్పీఏ
టీఎం14: స్పెషల్ ల్యాండ్ మ్యాటర్స్
టీఎం 32: ఖాతా మెర్జింగ్
ఆర్డీవో స్థాయి:
టీఎం 7: పాసు పుస్తకం లేకుండా నాలా కన్వర్షన్
టీఎం 16: ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు
టీఎం 20: ఎన్ఆర్ఐలకు సంబంధించిన సమస్యలు
టీఎం 22: సంస్థలకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు
టీఎం 26: కోర్టు కేసులు, సమాచారం
టీఎం 33: డేటా కరెక్షన్స్. మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం, (ఎకరం రూ.5 లక్షల లోపు ఉన్న ఏరియాలో చేయాలి)
కలెక్టర్ స్థాయి:
* అన్ని మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తులను రిపోర్టుల ఆధారంగా అప్రూవల్ చేయాలి.
* అలాగే మ్యుటేషన్, సక్సెషన్, పీవోబీ సమస్యలు, సెమీ అర్బన్ ఏరియాలో పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు, కోర్టు తీర్పుల ఆధారంగా పాసు పుస్తకాల జారీ, ఇండ్లు లేదా నివాస స్థలాలుగా మారిన భూముల నాలా కన్వర్షన్ వంటివి కలెక్టర్ చూస్తారు.
*టీఎం 33 కింద వచ్చిన పాసు బుక్ డేటా కరెక్షన్ లో పేరు మార్పు, ధరణి రాకముందే చ.గ.ల్లో అమ్మేసిన భూములు.
*ఎకరం రూ.5 లక్షలకు పైగా ఉన్న భూముల్లో విస్తీర్ణం, సర్వే నంబరు మిస్సింగ్ వంటి సమస్యలను పరిష్కారాన్ని కలెక్టర్లకు అప్పగించారు.
సీసీఎల్ఏ స్థాయి:
*టీఎం 33 కింద డేటా కరెక్షన్, నోషనల్ ఖాతా ట్రాన్స్ ఫర్, క్లాసిఫికేషన్ మార్పు, రూ.50 లక్షలకు పైగా విలువ చేసే భూముల్లో డేటా కరెక్షన్ వంటివి సీసీఎల్ఏలో చేస్తారు.
హోదా సమయం
తహశీల్దార్ 7 రోజులు
ఆర్డీవో 3 రోజులు
అదనపు కలెక్టర్ 3 రోజులు
కలెక్టర్ 7 రోజులు
అధికార వికేంద్రీకరణ తాత్కాలికమే
ఆర్వోఆర్ చట్టం 2020లో ఏ పని ఏ స్థాయి అధికారి చేయాలన్న అంశంపై స్పష్టత లేదు. పైగా 33 మాడ్యూళ్ల ద్వారా వచ్చే అప్లికేషన్ల పరిష్కారం సీసీఎల్ఏ, కలెక్టర్ల ద్వారా చేయించడంపై చట్టబద్ధత లేదు. ధరణి పోర్టల్ చట్టబద్ధతపైనే మంత్రి దామోదర రాజనర్సింహ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేసు ఇంకా విచారణలో ఉన్నది. అయితే 2.40 లక్షల పెండింగ్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి మాత్రమే ప్రస్తుతం తాత్కాలికంగా అధికార వికేంద్రీకరణ చేసినట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత ఆర్వోఆర్ యాక్ట్ లో సవరణలు లేదా కొత్త చట్టం ద్వారా కింది స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యే విధంగా అధికార వికేంద్రీకరణ చేయనున్నట్లు తెలిసింది.
పేరుపై పీటముడి
ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా రఘువీరారెడ్డి కాలంలో రెవెన్యూ సదస్సులతో లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ తొమ్మిది రోజుల కార్యక్రమానికి కూడా రెవెన్యూ సదస్సులు అనే పేరు పెట్టాలని ధరణి కమిటీలో మెజార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కానీ ఒకరు మాత్రం స్పెషల్ డ్రైవ్ గా పిలుద్దామని పట్టబట్టినట్లు తెలిసింది. అయితే రెవెన్యూ సదస్సులుగా నామకరణం చేస్తే గత కాంగ్రెస్ పాలన గుర్తుకు వచ్చేది.