Secretariat : రేపటి నుంచి సెక్రటేరియట్ ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు
తెలంగాణ సెక్రటేరియట్(Secretariat)ఉద్యోగులకు రేపటి నుంచి ఫేస్ రికగ్నిషన్(Face recognition) ద్వారా హాజరు నమోదు చేయనున్నారు
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సెక్రటేరియట్(Secretariat)ఉద్యోగులకు రేపటి నుంచి ఫేస్ రికగ్నిషన్(Face recognition) ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. ఇందుకు సంబంధించి సీఎస్ శాంతికుమారి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రెగ్యులర్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల హాజరు ప్రక్రియను ఇక నుండి ఫేషియల్ టెక్నాలజీ ద్వారా నమోదు చేస్తారు. ఉద్యోగుల సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ హాజరు ప్రక్రియకు నిర్ణయించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సచివాలయంలో ఉద్యోగులు విధులకు హాజరవుతున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి, పొన్నం, సురేఖ, సీతక్క, రాజనర్సింహలు తమ పేషీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విధులకు ఉద్యోగులు ఆలస్యంగా హాజరవుతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ప్రభుత్వం రేపటి నుంచి ప్రవేశపెట్టనుంది.
శుక్రవారం నుంచి ఉద్యోగుల రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు. సచివాలయంలో ప్రస్తుతం నాల్గో తరగతి ఉద్యోగుల నుంచి ఏఎస్ఓలు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీల వరకు దాదాపు 4వేల మంది పని చేస్తున్నారు. ఐఏఎస్ లు మినహా అందరికీ ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఉద్యోగానికి వచ్చిన సమయం.. వెళ్లే సమయం తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ ఉంటుంది. సచివాలయంలోని ప్రతి అంతస్తులో ప్రవేశ ద్వారాల వద్ద ఫేషియల్ రికగ్నైజేషన్ మిషన్ ఏర్పాటు చేశారు.