దేశంలో మతోన్మాద దాడులు.. బీజేపీ పాలనపై సీపీఎం జాతీయ నేత ఏచూరి ధ్వజం

దేశంలో మతోన్మాద శక్తులు పెట్రేగిపోతూ దాడులు చేస్తున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. పరోక్షంగా బీజేపీ విధానాలను విమర్శించారు.

Update: 2023-03-17 13:08 GMT

దిశ, వరంగల్ టౌన్: దేశంలో మతోన్మాద శక్తులు పెట్రేగిపోతూ దాడులు చేస్తున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. పరోక్షంగా బీజేపీ విధానాలను విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రను శుక్రవారం వరంగల్ లో ఏచూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిని దేశాద్రోహులుగా ముద్ర వేసి వేధిస్తున్నారని ఆరోపించారు.సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలతో భయబ్రాంతులకు గురి చేస్తున్నదని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశంలో ఇప్పటికి 5,500 కేసులు బనాయించి ఒక్కటి కూడా రుజువు చేయలేదని అన్నారు.

అక్రమంగా కేసులు పెట్టి విపక్షాల నేతలను తమ పార్టీలో చేర్చుకొని, ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కుట్ర పన్నుతోందన్నారు. 140 కోట్ల జనం తన వెనకే ఉన్నారని చెప్పుకుంటున్న మోదీ, దేశంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో లెక్క చూసుకోవాలని ఎద్దేవా చేశారు. 140 కోట్ల మంది మోదీ వెంటే ఉంటే, ఢిల్లీ కార్పొరేషన్ పీఠం ఎందుకు నెలబెట్టుకోలేదని ప్రశ్నించారు. మతోన్మాదం, కార్పొరేట్ వ్యవస్థ కవలలుగా దేశాన్ని దోచుకుంటున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఏచూరి ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన అవసరం మనందరిపైన ఉందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రూ. 11లక్షల కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసి పేద ప్రజలపై భారం మోపిందన్నారు. యేటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని ఏచూరి ధ్వజమెత్తారు.

రైతులకు కనీస మద్దతు ధర చెల్లించడంలో మోదీ సర్కారు విఫలం అయిందన్నారు. దేశంలో 20 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నామని చెబుతున్న మోదీ, మిగతా వంద కోట్ల జనం సంగతి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఈ సమస్యలకు ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని, మోదీ ప్రభుత్వం దిగిపోతేనే సాధ్యమవుతుందని అన్నారు. అందుకు ప్రజలందరూ బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో నిరుపేదల పక్షాన సీపీఎం పోరాటం చేస్తుందని, గుడిసెవాసులకు అండగా నిలుస్తుందని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. పోరాటంతో ఏదైనా సాదించుకోవచ్చని, అందరూ కలిసి కట్టుగా ఉండాలని సూచించారు. 

Tags:    

Similar News