సైబరాబాద్‌ సీపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత

పార్టీమారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Update: 2024-09-12 12:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్టీమారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముఖ్యంగా తెలంగాణ శాసనసభలో పీఏసీ గా ఎన్నికైన అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు, మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో గురువారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై పలువురు దాడి చేశారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు.. పిర్యాదు చేయడానికి సైబరాబాద్‌ సీపీ కార్యాలయానికి వెళ్లారు. అయితే పోలీసులు మాత్రం కేవలం ముగ్గురు ఎమ్మెల్యేకు మాత్రమే సీపీ ఆఫీసులోకి అనుమతిస్తామని.. గేటు వద్దనే నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాసేపు పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. ఎమ్మెల్యేలందరినీ సీపీ కార్యాలయంలోనికి అనుమతించాలంటూ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీ ఆఫీస్‌ మెట్లపై బైఠాయించారు. అనంతరం లోనికి నడుచుకుంటూ వెళ్లిన హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి ఫిర్యాదు చేశారు.

అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఎమ్మెల్యే గాంధీ, ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు పెట్టాలని, ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష జరపాలని, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుంటే కోర్టుకెళ్తామని.. అవసరమైతే ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పుకొచ్చారు.


Similar News