రియల్ ఎస్టేట్ వ్యాపారుల బరితెగింపు.. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కబ్జా
రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలకు నీళ్లు ఇచ్చేందుకు ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీటిని వదులుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలకు నీళ్లు ఇచ్చేందుకు ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీటిని వదులుతోంది. దీంతో చివరి భూములకు సైతం సాగునీరు అందిస్తుండడంతో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కాగా, కొన్నిచోట్ల అక్రమార్కులు ఆ పంట కాల్వలను ఆక్రమిస్తుండడంతో రైతుల భూములకు సాగునీరు అందడం లేదు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని వరంగల్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న శివాన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్ నిర్వాహకులు ఎస్ఆర్ఎస్పీ కాలువను ఆక్రమించిన ఘటన చోటు చేసుకుంది.
కాల్వను కుదించి రోడ్డు వేయడంతో సమీప పొలాలకు నీరు వెళ్లడం లేదు. అంతేకాక నీటి ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో నీరు వెళ్లకపోవడంతో పంట పొలాలు మునుగుతున్నాయి. దీంతో ఆ పొలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. నెక్కొండ-వరంగల్ ప్రధాన రహదారి అయిన 100 ఫీట్ల రోడ్డు వరకు వెంచర్ నుంచి రోడ్డు వేసే క్రమంలో నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టారు. కబ్జాకు గురైన కాలువను ఇరిగేషన్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో కొనుగోలుదారులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. - దిశ, నెక్కొండ
దిశ, నెక్కొండ : రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలకు నీళ్లు ఇవ్వాలనే సదుద్దేశంతో ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీటిని వదులుతుంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని వరంగల్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ‘శివాన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్’ నిర్వాహకులు ఎస్ఆర్ఎస్పీ కాలువను కుదించారు. అంతేకాక దానిపై రోడ్డు వేయడంతో సమీప నీరు వెళ్లేందుకు మార్గం లేక పంట పొలాలు నీటమునుగుతున్నాయి. ఈ క్రమంలో పరిసర పంట పొలాల రైతులు అవస్థలు పడుతున్నారు.
కాలువనే మూసేసారు..
నెక్కొండ-వరంగల్ ప్రధాన రహదారి అయిన 100 ఫీట్ల రోడ్డు వరకు శివాన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్ నుంచి రోడ్డు వేసే క్రమంలో వెంచర్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేశారు. ఎస్ఆర్ఎస్పీ కాలువలో చిన్న మోరీ వేసి కాలువ వెడల్పును కుదించారు. దానిపై నుంచి నెక్కొండ- వరంగల్ ప్రధాన రహదారి వరకు రోడ్డు వేశారు. కబ్జాకోరల్లో చిక్కుకున్న కాలువను ఇరిగేషన్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
వెంచర్ ముందు వరకు కాలువ వెడల్పుగా ఉండి సమృద్ధిగా నీరు వస్తుంది. వెంచర్ ప్రధాన ద్వారం ఆర్చి దగ్గరకు వచ్చేసరికి చిన్న మోరి(పైప్) వేసి నిర్వాహకులు దానిపై నుంచి రోడ్డు వేశారు. దీంతో కాల్వ ఉండాల్సిన వెడల్పుకంటే తక్కువ ఉండడంతో నీటి ప్రహహం ఎక్కువై పక్కనే ఉన్న పంట పొలాలు నీట మునుగుతుండడంతో పరిసర పంట పొలాల రైతులు ఆవేదన చెందుతున్నారు.
పంట పొలాల్లో తవ్వారు.. వెంచర్‌లో వదిలేశారు..
సాధారణంగా ఇరిగేషన్ అధికారులు పంటలకు నీళ్లు వదిలే క్రమంలో కాలువలు తీస్తారు. తమ వద్ద ఉన్న మ్యాప్ ఆధారంగా కాలువలు తీసి నీటిని రైతులకు అందిస్తారు. రైతులు అభ్యంతరం తెలిపినా తమ వద్ద ఉన్న మ్యాప్(నక్ష్య) ఆధారంగా కాలువ తీసే హక్కు ఇరిగేషన్ అధికారులకు ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతుల పొలాల్లో కాలువలు తీసిన అధికారులు వెంచర్ ముందు ఉన్న కాలువ తీయకపోవడంలో ఆంతర్యం ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. కాలువ వెడల్పు గణనీయంగా కుదించినా ఇరిగేషన్ అధికారులకు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సర్వ హంగులు ఉన్నట్టేనా..?
శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న నెక్కొండ మండల కేంద్రంపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నుపడింది. వరంగల్ వంటి పట్టణంలో గజం ధర రూ.15వేల నుంచి రూ.20వేలు ఉంది. నెక్కొండ మండలంలో సైతం అదే మాదిరి ధరలు ఉండడంతో ఇదే అదునుగా భావించిన రియల్టర్లు నూతన వెంచర్ల ఏర్పాట్లకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో రియల్టర్లు కస్టమర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. వెంచర్లలో పిల్లలకు ఆహ్లాదకరమైన ఆటస్థలం, చక్కని అనువైన గార్డెన్ ఉన్నట్లు చెబుతున్నప్పటికీ అటువంటి ఆనవాళ్లు మచ్చుకు కానరాకపోవడం కొసమెరుపు. వెంచర్లలో సకల సదుపాయాలు ఉన్నాయంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
వెంచర్‌కు దారేది..?
వెంచర్ ముందుభాగం నుంచి కెనాల్ ఉన్న విషయం జగమెరిగిన సత్యం. ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుని కాలువ తీస్తే ప్లాట్లు కొన్న సామాన్య ప్రజలకు భవిష్యత్తులో దారి సమస్యలు రావొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ప్లాట్లు కొన్న ప్రజల పరిస్థితి ఏంటనేది వారికే తెలియాలి. ఈ విషయమై రైతులు పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.
ఇంత తతంగం నడుస్తున్నా ఎస్ఆర్ఎస్పీ అధికారులకు కనిపించడం లేదా..? పంటలు నీటమునిగి అవస్థలు పడుతున్న రైతులు పరిస్థితి ఏంటి..? ఇకనైనా ఇరిగేషన్ అధికారులు వెంచర్ ముందు ఉన్న కెనాల్‌ను తీసి నీరు వెళ్లేలా చేస్తారా..? లేదోనని అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా కలెక్టర్ సంబంధిత ఇరిగేషన్ ఉన్నతాధికారులను పంపించి సమస్యను పరిష్కరించాలని చుట్టుపక్కల రైతులు కోరుతున్నారు. ఈ సమస్యపై అధికారులు ఏవిధంగా స్పందిందిస్తారనేది వేచి చూడాల్సిందే.
అనుమతులు ఇవ్వలేదు
- యాదగిరి, డీఈ, ఇరిగేషన్
శివాన్ వెంచర్ ముందు ఉన్న కెనాల్‌ను 10నుంచి 12 క్యూసెక్కుల వాటర్ వెళ్లేందుకు ఏర్పాటు చేసింది. వెంచర్ నిర్వాహకులు పైప్ వేసి తాత్కాలికంగా రోడ్డు వేసుకున్నారు. సంబంధిత వెంచర్ నిర్వాహకులకు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు.