CM కేసీఆర్‌కు కొత్త తలనొప్పి.. ఆత్మీయ సమ్మేళనంలో BRS బహిష్కృత నేత ప్రత్యక్షం!
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా తయారైంది బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి.
దిశ, డైనమిక్ బ్యూరో: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా తయారైంది బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి. ఎన్నికల వేళ పార్టీలోని నేతల మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చేందుకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరుపై స్థానిక నేతలు భగ్గుమంటున్నారు. ఇన్నాళ్లు ఉద్యమకారులను పట్టించుకోకుండా తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమ్మేళనాలు నిర్వహిస్తే ఆత్మీయత వస్తుందా అని సొంత పార్టీ నేతలే నిలదీస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ బహిష్కృత నేత కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
అంతే కాదు రాఘవను కొత్తగూడెం బీఆర్ఎస్ నాయకులు పబ్లిక్‌గానే సన్మానించడం దుమారం రేపుతోంది. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవ నిందితుడు. ఈ కేసులో ఏ2గా ఉన్న ఆయన జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ విషయంలో బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు రావడంతో అప్పట్లో అతడిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. నేర చరిత్ర కలిగిన రాఘవ తిరిగి ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రత్యక్షం కావడం.. అతడిని నేతలు సన్మానించడంతో రాఘవ సస్పెన్స్ ఉత్తిమాటేనా అనేది సందేహంగా మారింది.
సమ్మేళనాలతో కొత్త తలనొప్పులు:
ఎన్నికల ఏడాదిలో పార్టీ శ్రేణులను ఏకం చేసి కొత్త జోష్ నిండేలా చేయాలని సీఎం కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలకు ప్రణాళిక రచించారు. పెద్ద ఎత్తున జిల్లాల్లో నేతలతో నాయకులు మమేకం కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలను అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నారని నేతలు అలర్ట్‌గా ఉండాలని మంత్రి కేటీఆర్ ఇటీవలే నేతలను అప్రమత్తం కూడా చేశారు. కానీ వీటితో ఆత్మీయత కంటే విభేదాలే పొడచూపుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. కార్యకర్తలు నేతలు హాజరయ్యే ఈ కార్యక్రమాల్లో పలు జిల్లాల్లో గ్రూప్ తగాదాలు భగ్గుమంటున్నాయి.
ఒక్కో నియోజకవర్గంలో పది గ్రామాలను కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని పార్టీ నిర్ణయించగా అసంతృప్తులు మాత్రం ఈ వేదికల్లో తమ అలకను, అసంతృప్తులను ప్రదర్శిస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మరోసారి పొరపచ్చాలు బహిర్గతం అయ్యాయి. ఆత్మీయ సమ్మేళనాలకు తనకు ఆహ్వానాలు అందడం లేదని కడియం శ్రీహరి భగ్గుమన్నారు.
ఇక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై నిర్మల్ నియోజకవర్గ సీనియర్ నేత శ్రీహరిరావు విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్లు ఉద్యమకారులను పట్టించుకోని మంత్రి ఎన్నికల కోసం ఆత్మీయత ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గమైన మహేశ్వరంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. సీనియర్లు తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు.
వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ను సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తామంతా కలిసి ఆనంద్‌ను ఓడిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఇక తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. కుత్భుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకాకు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు మధ్య సయోధ్య పొసగడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పార్టీలోనూ ఎమ్మెల్యేలు, మంత్రులపై నాయకులు అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి అంతా ఐక్యమై ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతారని భావిస్తే సొంత పార్టీలోనే ఆత్మయ మంటలు చెలరేగడం హాట్ టాపిక్ అవుతోంది.