పెండింగ్ స్థానాలపై కుస్తీ.. సమస్యగా మారిన ఆ సెగ్మెంట్లు
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. మెజారిటీ గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. మెజారిటీ గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరి మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. అయితే చాలా చోట్ల అభ్యర్థులను ఫిక్స్ చేసినప్పటికీ కీలక స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థుల పై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. హైదరాబాద్ ఎంపీ సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ కి మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత ఫెరోజ్ ఖాన్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. మిగిలిన రెండు నియోజకవర్గాల్లో ముఖ్యంగా సామాజిక సమీకరణాలతో పాటు పార్టీ కీలక నేతలు పోటీ ఉండటంతో సమస్యగా మారింది. కరీంనగర్ బీసీకి కావాలంటూ అక్కడి నేతలు పట్టుబడుతున్నారు. ఖమ్మం టికెట్‌ను కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలంటూ కొందరు.. రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని కొందరు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణికి కేటాయించాలని కొందరు.. అందరినీ కాదని మండవ వెంకటేశ్వరరావు ఇవ్వాలని కొందరు కోరుతున్నారు. అయితే ఈ రెండు స్థానాల్లో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్‌లు అభ్యర్థులను ప్రకటించేశాయి.
రేపు ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం
పెండింగ్ స్థానాల్లో నేతల మధ్య పోటీ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అసంతృప్తి లేకుండా వ్యూహ రచన వేస్తున్నది. రేపులో ఢిల్లీలో జరిగబోయే సీఈసీ మీటింగ్‌లో పెండింగ్ స్థానాలపై పెద్దలు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే రేపు రాత్రికి ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్‌కు ఒక పెండింగ్ స్థానం మిగిలి ఉంది. బీఆర్ఎస్ ఇతర పార్టీల కంటే ముందుగానే లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే వరంగల్ బరిలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టికెట్ ఇవ్వగా చివరి టైంలో ఆమె కాంగ్రెస్‌లో చేరి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఫామ్ హౌస్‌లో వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అయినట్లు తెలిసింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రాజయ్యను ప్రకటించే అవకాశాలున్నాయి.
సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు
బీజేపీ మాత్రం 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది. ప్రధాని మోడీ చరిష్మాతో విజయం సాధించాలని భావిస్తోంది. 400 సీట్లు గెలవాలని ప్రధాని మోడీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు మెజార్టీ మార్క్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే భిన్నంగా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.