Disha Special: మహిళలకు ఉపాధిని కల్పిస్తోన్న ఉచిత బస్సు.. ఆర్థికంగా బలపడుతున్న లేడీస్

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలు ఉపాధి అవకాశంగా మలచుకుంటున్నారు.

Update: 2025-03-26 06:44 GMT
Disha Special: మహిళలకు ఉపాధిని కల్పిస్తోన్న ఉచిత బస్సు.. ఆర్థికంగా బలపడుతున్న లేడీస్
  • whatsapp icon

దిశ , హైదరాబాద్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలు ఉపాధి అవకాశంగా మలచుకుంటున్నారు. ఉచిత ప్రయాణం ఉపాధిని ఎలా కల్పిస్తోందని అనుకుంటున్నారా ? అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇది మహిళా సాధికారతకు , వారు సొంతకాళ్లపై నిలబడేందుకు ఎంతో దోహదపడుతోంది.

ఉపాధి కోసం నగరానికి...

హైదరాబాద్ నగరానికి సుమారు వంద కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలలో నివాసముంటున్న వారు ప్రభుత్వం ఇచ్చిన ఉచిత హామీని సద్వినియోగం చేసుకుని ఉపాధిని పొందుతున్నారు. గ్రామాలలో ఉపాధి పనులు అంతగా దొరక్కపోవడం, రెక్కాడితేనే డొక్కాడని పేద మహిళలు కొంతమంది వినూత్నంగా ఆలోచించడం మొదలు పెట్టి దానికి కార్యరూపమిచ్చారు . ఉదయం తమ గ్రామాల నుంచి బయలుదేరి నగరానికి వచ్చే ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల ద్వారా వీరు సిటీకి చేరుకుని శివారు ప్రాంతాలలోని ఇండ్లలో పని చేస్తున్నారు. ఇలా మధ్యాహ్నం వరకు నాలుగు నుంచి ఐదు ఇండ్లలో పనులు చేసి తిరిగి తమ ఊరికి వెళ్లిపోతూ ఇంటి పనులను చక్కదిద్దుకుంటున్నారు. కొంతమంది బస్సులలో వచ్చి అడ్డా కూలీలుగా పని చేస్తూ ఉపాధిని పొందుతున్నారు. నెలకు కనీసం ఒక్కొక్కరు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు సంపాదిస్తూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. ఆర్టీసీ బస్సులలో టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్గి ఉండడంతో వీరు తిరుగు ప్రయాణంలో పలు బస్సులు మారి సొంతూరికి చేరుకుంటున్నారు.

కూరగాయల విక్రయాలు

గ్రామాలలో వ్యవసాయం కలిగి ఉండి పండించిన పంటలను మార్కెట్ లో విక్రయించి కూడా ఉపాధిని పొందుతున్నారు. తమ పొలాల్లో పండించిన కూరగాయలు, పండ్లు, పాలు,పెరుగుతో పాటు నెయ్యి, తేనె తదితర గ్రామీణ ఉత్పత్తులను ఆర్టీసీ బస్సులలో నగరానికి తీసుకుని వచ్చి విక్రయాలు చేపడుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఊర్లలో పండించిన పంటలకు అంతగా డిమాండ్ లేకపోవడం, తక్కువ ధరలకే విక్రయాలు చేపట్టాల్సి రావడంతో గతంలో గత్యంతరం లేక వారు అడిగిన ధరకే అమ్ముకునేవారు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో మహిళల ఆలోచనలలో కూడా మార్పు వచ్చింది. దీంతో ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు.

మహిళా ఉద్యోగులూ..

ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలు సైతం గ్రామాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్ వంటి మహానగరంలో ఇంటి అద్దెలు ఆకాశన్నంటున్నాయి. కనీసం పదివేల రూపాయలు వెచ్చించనిదే సింగల్ బెడ్ రూం ఇండ్లు సైతం రావడం లేదు. దీంతో నగరానికి వీలైనంత దూరంలో తక్కువ అద్దెలకు ఇండ్లు కిరాయికి తీసుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సాగిస్తున్నారు. ఉదయం బయలు దేరి సిటీకి చేరుకుని ఉద్యోగం, వ్యాపార పనులు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లిపోతున్నారు. మొత్తం మీద ఉచిత ఆర్టీసీ ప్రయాణం మహిళలకు ఓ వరంగా మారింది. దీంతో వారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

తప్పిన ఇంటి అద్దెల బెడద...

సొంతూళ్లలో నివాసముంటున్న మహిళలు నగరానికి ఆర్టీసీ బస్సులలో వచ్చి పనులు చక్కబెట్టుకుని తిరిగి ఊరికి వెళ్లిపోతున్నారు. దీంతో నగరంలో ఇండ్లు అద్దెకు తీసుకునే బెడద తప్పిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోనే నివాసముంటే వచ్చే సంపాదనలో సగానికి పైగా ఇంటి కిరాయిలకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, ఉచిత బస్సు ప్రయాణం పుణ్యమా అని వాటి నుంచి ఉపశమనం పొందుతున్నారు . అంతేకకాకుండా ఇండ్ల వద్దనే ఉంటూ పిల్లల మంచి చెడులు చూసుకునే అవకాశం ఉందని, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

34 లక్షల జీరో టికెట్లు

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకోసం ప్రవేశ పెట్టిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 బస్ డిపోల పరిధిలో పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్, సూపర్ డీలక్స్, రాజధాని సుమారు 64 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు . వీరిలో సుమారు 34 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం సాగిస్తుండడంతో వీరికి జీరో టిక్కెట్లు జారీ చేస్తున్నారు .

బస్సులన్నీ ఫుల్

గతంలో హయత్​నగర్​ డిపో 1 పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల నుంచి అంతగా స్పందన వచ్చేది కాదు. ఎక్కువగా ప్రైవేట్​వాహనాల్లోనే వెళ్లేవారు. ఇంజినీరింగ్​కాలేజీ విద్యార్థులే ఉదయం సాయంత్రం వేళల్లో బస్​పాస్​లతో వచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ప్రవేశ పెట్టడంతో హైదరాబాద్​ ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటూ ఉపాధి పొందే మహిళలు ఉదయం సాయంత్రం వేళల్లో కిక్కిరిసి పోతున్నాయి. కూలీ పనులు చేసుకునేవారు, కూరగాయలు, పాలు తదితర నిత్యావసరాల సరుకులు మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా హయత్​నగర్​ 1 డిపో పరిధిలోని నగర శివారు ప్రాంతాలైన పిలాయిపల్లి, బండరావిరాల, అనాజ్​పూర్​, కవాడ్​పల్లి, లష్కర్​గూడ మసీద్​పూర్​, తదితర గ్రామాల నుంచి ఉదయం హైదరాబాద్​కు వచ్చి సాయంత్రం వెళ్తున్నారు. దీంతో వారి నుంచి బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్​ వ్యక్తమవుతోంది.

- శ్రీనివాస్​, హయత్​నగర్ ​డిపో 1 కండక్టర్​

బస్సులు పెంచాలి..

గత 18 సంవత్సరాలుగా గుడిమల్కాపూర్ మండిలో ఆకు కూరలు అమ్ముతున్నాను. ఫ్రీ బస్సు అందుబాటులోకి వచ్చాక సౌకర్యం బాగానే ఉంది. కానీ టంగుటూరి నుంచి మార్కెట్ కు ఒక్కటే బస్ ఉంది.ఉదయం సాయంత్రం మాత్రమే వస్తుండడంతో రద్ధీగా ఉంటోంది . మరో రెండు బస్సులు ఏర్పాటు చేస్తే బావుంటుంది.

- అనిత, కూరగాయల వ్యాపారి, టంగుటూరు, శంకర్ పల్లి

Tags:    

Similar News