Telangana Cabinet: మాలలకే పదవులా.. మాదిగలు పట్టరా? ఢిల్లీకి వెళ్తున్న కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగింటిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నా.. తుది ఎంపికపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఆశావహుల పేర్లను అధిష్టానానికి పంపినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పటికే మాలలకు పలు పదవులు ఇచ్చారని, మళ్లీ వారికే ఇస్తామంటే ఎలా అంటూ.. తమ వర్గానికి సైతం అవకాశం ఇవ్వాలంటూ మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు అధిష్టానం వద్ద విన్నవించేందకు ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే అగ్రనేతలకు మెయిల్..
కేబినెట్ విస్తరణలో భాగంగా బీసీ, ఎస్సీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు దక్కనివారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. చీఫ్ విప్ పదవి మాదిగ వర్గానికి లేదంటే బీసీలో మంత్రి పదవి దక్కని మరో సామాజికవర్గానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎస్సీ మాదిగ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే మెయిల్ ద్వారా కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్‌కు ఎమ్మెల్యేలు లేఖలు పంపారు. కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, కాలే యాదయ్యలు.. కేబినెట్‌లో తమ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒకే ఇంట్లో ఇద్దరున్నా.. ఆపై మంత్రి పదవా?
కాంగ్రెస్‌లో మాల సామాజిక వర్గానికి పదవులు ఎక్కువగా ఇచ్చారనే చర్చ నేపథ్యంలో వారికి ఇంకా ఎన్ని పదవులు ఇస్తారని మాదిగ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ వర్గానికి రెండు మంత్రి పదవులు, స్పీకర్ పదవి ఇచ్చారని, అదేవిధంగా ఒక కుటుంబంలో(వివేక్) రెండు ఎమ్మెల్యే పదవులు, ఒక ఎంపీ పదవి ఇవ్వడమే కాక మళ్లీ మంత్రి పదవి ఇస్తే ఊరుకోమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఎస్సీలకు ఒక్క మంత్రి పదవి కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.