VH: రేవంత్ సర్కార్‌కు కాంగ్రెస్ మాజీ MP వీహెచ్ కీలక రిక్వెస్ట్

కుల గణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పేర్కొన్నారు.

Update: 2024-07-20 17:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కుల గణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. కుల గణన చేశాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారని, ఇందుకు సీఎం రేవంత్ రెడ్డికి, పొంగులేటికి ధన్యవాదాలన్నారు. రైతు రుణమాఫీతో సీఎం రేవంత్ మంచి పేరు తెచ్చుకున్నాడన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తెలంగాణ ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేస్తూనే, ఒకే విడతలో రెండు లక్షలు రుణమాఫీ చేయడం గొప్ప విషయమన్నారు. ఇక రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే ఛాన్స్ కొద్దిలో మిస్ అయిందన్నారు.

అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని చెప్పారని, అయితే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో బిల్లు పెట్టించే ప్రయత్నం చేయాలన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీసీలంతా కాంగ్రెస్ వైపు నిలబడ్డారన్నారు. అందుకే తెలంగాణలో పవర్ వచ్చిందన్నారు. బీహార్‌లో నితీష్ కుమార్, తమిళనాడులో స్టాలిన్ కులగణన చేస్తున్నారని, రాష్ట్రంలోనూ చేయాల్సిన బాధ్యత ఉన్నదన్నారు. మరోవైపు గత ప్రభుత్వం క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలేదని, ఇప్పుడు రేవంత్ సర్కార్ క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలలో క్రీడలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో క్రీడలకు ఐదు ఎకరాలు కేటాయించాల్సిన అవసరం ఉన్నదన్నారు. త్వరలోనే సీఎంకు లెటర్ రాస్తానని చెప్పారు.


Similar News