KTR : చారాణ కోడికి.. బారాణ మసాలా..! రైతు రుణమాఫీపై కేటీఆర్ సామెత ఇదే
సీఎం గారు.. ఊరించి.. ఊరించి.. ఏడు నెలలు ఏమార్చి చేసిన.. మీ రుణమాఫీ తీరు చూస్తే.. తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే.. “ చారాణ కోడికి! బారాణ మసాలా!! ” అని కేటీఆర్ విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం గారు.. ఊరించి.. ఊరించి.. ఏడు నెలలు ఏమార్చి చేసిన.. మీ రుణమాఫీ తీరు చూస్తే.. తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే.. “ చారాణ కోడికి! బారాణ మసాలా!! ” అని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని ఆరోపించారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు.. రైతు మాఫీ పథకానికి మరణ శాసనాలైనాయన్నారు. అన్ని విధాలా అర్హత ఉన్నా కానీ ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేటోడు లేడని, రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడన్నారు.
అర్హులైన లబ్ధిదారులు.. రుణమాఫీ కాక.. అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు? అని ప్రశ్నించారు. నలభై లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా? ముప్పై లక్షల మందిని మోసం చేసినందుకా ? అని నిలదీశారు. రెండు సీజన్లు అయినా రైతు భరోసా ఇంకా షురూ చేయలేదన్నారు. జూన్ లో వేయాల్సిన రైతు భరోసా జూలై వచ్చినా రైతుల ఖాతాలో వేయలేదన్నారు. కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15 వేలు ఇవ్వలేదన్నారు. రైతు కూలీలకు రూ.12 వేల హామీ ఇంకా అమలు చేయలేదని గుర్తు చేశారు. మభ్యపెట్టే మీ పాలన గురించి.. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్, ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్ అని కేటీఆర్ ఆరోపించారు.