కేసీఆర్ సీఎంగా ఉంటే.. రాష్ట్రంలో ఒక్క ఎకరం ఎండేదికాదు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

ప్రభుత్వ చేతగాని తనంతోనే రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్య ఏర్పడిందని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు.

Update: 2024-04-02 15:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ చేతగాని తనంతోనే రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్య ఏర్పడిందని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. సాగునీటి రంగంపై అవగాహన, నిర్లక్ష్యమే నీటి ఎద్దడికి కారణమని ధ్వజమెత్తారు. వరి పంటకు క్వింటాకు 500బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ బృందం మంగళవారం సచివాలయంలో సీఎస్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ప్రకృతి కొంత కరువు కారణమైతే, ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్షపూరిత వైఖరితో రైతాంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందన్నారు. నీటిని పంటకు ఎలా ఇవ్వాలో తెలియక ప్రభుత్వం విఫలైందన్నారు.

గత ఐదేళ్లు కేసీఆర్ 24గంటల కరెంటు సరఫరా, కాళేశ్వరం, గోదావరి, కృష్ణానీటితో చెరువులను, చెక్ డ్యాంలను నింపడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ చేశారన్నారు. కేసీఆర్ అధికారంలో ఉంటే ఒక్క ఎకరం కూడా ఎండేదికాదన్నారు. కరీంనగర్ కేసీఆర్ వస్తున్నాడని తెలిసి గాయత్రి పంప్ ద్వారా నీళ్లను లిఫ్ట్ చేసి కాలువలకు వదిలారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రైతులు ఉన్నారన్న సోయి కూడా లేదని, ఆయన మూటలతో ఢిల్లీకి పోవడమే సరిపోతోందని దుయ్యబట్టారు. ప్రతి దానికి నోరు పారేసుకోని కేసీఆర్‌పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీతి తప్పి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మంత్రులు భట్టి విక్రమార్కకు, ఉత్తమ్ కుమార్ రెడ్డికీ ఎన్నడూ బాధ్యత తెలియదని, రైతుల గురించి తెలియదన్నారు.

పత్రికలకు లీక్‌లు ఇచ్చి పెద్ద పెద్దగా రాయించి బతుకుదామని అనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రాక ముందు ఇంతకంటే ఎక్కువ కుట్రలు చేసి పెద్ద పెద్దగా వార్తలు రాశారని, అయినా పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. గత 15రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పొలాల్లో రైతుల దగ్గరకు వెళ్ళిందని, పంట నష్టం అంచనా వేసి సీఎస్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు. 100 రోజుల్లోనే 2014 కంటే ముందు పరిస్థితిలు రాష్ట్రంలో వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధైర్యం చెప్పేందుకు రైతుల దగ్గరకు కేసీఆర్ వెళ్తున్నాడన్నారు. రైతు బంధు, 2లక్షల రుణ మాఫీ వెంటనే అమలు చేయాలని, ఎన్నికల కోడ్ ఉందని ఆగొద్దని, తాము ఎక్కడా ఈసీ‌కి ఎటువంటి ఫిర్యాదులు చేయబోమన్నారు.

ప్రధానప్రతిపక్షంగా పూర్తి మద్దతు ఇస్తామన్నారు. క్వింటాల్‌కు 500 బోనస్ ఇచ్చి వడ్లు, మొక్కజొన్నలు కొనాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రకృతి కరువు కాదు.. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువేనని మండిపడ్డారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, పోరాటం చేస్తామన్నారు. ఎండిన ప్రతి ఎకరాకు 25వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దండె విఠల్, సత్యవతి రాధోడ్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి పాల్గొన్నారు. 

Tags:    

Similar News