హిందూ ఏక్తా యాత్రకు సర్వం సిద్ధం.. కాషాయమయం కానున్న కరీంనగర్
కరీంనగర్ కాషాయమయం కానుంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న హిందూ ఏక్తా యాత్రకు సర్వం సిద్ధమైంది.
దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ కాషాయమయం కానుంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న హిందూ ఏక్తా యాత్రకు సర్వం సిద్ధమైంది. దాదాపు లక్ష మందితో ఈ యాత్రను నిర్వహించనున్నారు. హిందూ ధర్మ రక్షణ, హిందువులను సంఘటితం చేసేందుకే బండి సంజయ్ ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా చేపట్టే ఈ యాత్ర పదేండ్లుగా కొనసాగుతోంది. ఆదిలో కొద్ది మందితోనే ప్రారంభమైన ఈ యాత్ర నేడు లక్ష మందితో నిర్వహించేంత స్థాయికి చేరుకుంది. దీని వెనుక బండి సంజయ్ ఎనలేని కృషి ఉంది. సామాన్య కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి బండి సంజయ్ ఈ యాత్రను చేపడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో లక్ష మందితో యాత్ర చేపడుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
హిందువులను సంఘటితం చేసే హిందూ ఏక్తా యాత్రకు ముఖ్య అతిథిగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ చుగ్, కేరళ స్టోరీస్ సినిమా బృందం ఇందులో భాగం కానుంది. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొనాలని బండి సంజయ్ ఇప్పటికే పిలుపునిచ్చారు. పదేండ్లుగా ఏటా హనుమంతి జయంతి రోజున ఏక్తా యాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్ రాజకీయాలకతీతంగా హిందువులను సంఘటితం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. బండి సొంత జిల్లాలో జరుగుతున్న యాత్ర కావడంతో విజయవంతం చేసేందుకు భారీగా జన సమీకరణ చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందువులను తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి కనీవినీ ఎరగని రీతిలో ఏక్తా యాత్ర చేపట్టాలని బండి సంజయ్ భావిస్తున్నారు.
ఈ యాత్రకు అస్సా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, తరుణ్ చుగ్, కేరళ స్టోరీ టీం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. హిందూ సంస్కృతి, సంప్రాదాయాలు ఉట్టిపడేలా.. సంఘటిత శక్తిని చాటేలా ఈసారి ఏక్తా యాత్ర కొనసాగనుంది. అటు ఏక్తా యాత్రతో పాటు, ఇటు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టి హిందువులకు ఒక బ్రాండ్‌గా బండి సంజయ్ ఏర్పడ్డారు. ఇదిలా ఉండగా తొలుత ఈ హిందూ ఏక్తా యాత్రకు పోలీసుల అనుమతి లభించలేదు. కానీ బీజేపీ నేతలు పట్టుపట్టడంతో ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి లభించింది. ఈ ర్యాలీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
హిందూ ఏక్తా యాత్ర కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్ నుంచి మొదలుకుని రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్, భరత్ థియేటర్ చౌరస్తా, కమాన్ చౌరస్తా, బస్టాండ్, తెలంగాణ చౌక్, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్, బీఆర్ అంబేద్కర్ చౌరస్తా, మంచిర్యాల రోడ్డులోని చౌరస్తా, గాంధీ రోడ్డు వరకు ఈ యాత్ర సాగనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ హిందూ ఏక్తా యాత్ర రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది. అస్సాం ముఖ్యమంత్రి హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు.