ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితుడిని నేనే.. KCR అన్ని విన్నాడు: ఈటల కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

Update: 2024-04-07 08:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఈటల మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో మొదటి బాధితుడిని నేనేనని కీలక వ్యాఖ్యలు చేశారు. నాతో పాటు నా కుటుంబసభ్యులు, డ్రైవర్, వంట మనుషుల నుంచి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే తాను ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నానని అన్నారు. కేసీఆర్ తన కేబినెట్‌లోని 17 మంది మంత్రులను కూడా నమ్మలేదని.. వాళ్ళ ఫోన్లు, భార్యభర్తల సంభాషణలు కూడా విన్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల కొందరి కాపురాలు కూలిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా బాధకరమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ హయాంలో గెలిచిన ఎమ్మెల్యేలను కాదని.. ఓడిన ఎమ్మెల్యేలతో ప్రారంభోత్సవాలు జరిపించారని.. ఎమ్మెల్యేగా ఉన్నా.. కనీసం ప్రోటోకాల్ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో ఓడించింది పట్నం నరేందర్ రెడ్డి.. ఇప్పుడు ఆ కుటుంబీకులను రేవంత్ మల్కాజిగిరి బరిలో దింపాడని విమర్శించారు. కేబినెట్ నుండి బర్తరఫ్ చేసి, బీఆర్ఎస్ నుండి మెడలు పట్టి బయటకు పంపాక నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 12 సీట్లు పైబడి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


Similar News