అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన గొప్ప సంగీత విద్వాంసుడు ఎల్లా
సంగీత కళాకారుడిగా, సంగీత శాస్త్ర బోధకుడిగా, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గా,
దిశ, రవీంద్రభారతి : సంగీత కళాకారుడిగా, సంగీత శాస్త్ర బోధకుడిగా, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గా, మృదంగ వాయిద్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన గొప్ప సంగీత విద్వాంసుడు ఎల్లా అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. సంగీతం రంగానికి 75 ఏండ్లుగా చేసిన విశిష్ట సేవలకుగానూ ఆయన శిష్య బృందం జూబ్లీ వేడుకలు ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సాధారణంగా శాస్త్రీయ సంగీత కచేరీలలో మృదంగం పక్క వాయిద్యం గా మాత్రమే ఉంటుంది. అలాంటి పక్క వాయిద్యాన్ని ప్రధాన వాయిద్యంగా కేంద్ర స్థానంలో పెట్టి శాస్త్రీయ సంగీత చరిత్రలో అరుదైన చరిత్రకు శ్రీకారం చుట్టిన ఘనత ఎల్లా అని అన్నారు. ఈ సందర్భంగా ఎల్లా వెంకటేశ్వరరావును మంత్రి జూపల్లి, పద్మశ్రీ అవార్డు గ్రహీత నాదసుడార్ణవ డా. అన్నవరపు రామస్వామి ఘనంగా సన్మానించారు. అనంతరం స్వర్ణ ఘంటాకంకణ ప్రదానం చేశారు. ముందుగా, యెళ్ల వెంకటేశ్వరరావు వినూత్న కృషి ప్రస్తావిస్తూ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. కార్యక్రమంలో ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఆర్థికవేత్త ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, టీటీడీ అన్నమాచార్య డైరెక్టర్ డా.ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.