బల్దియాకు ఎలక్షన్ ఫీవర్.. మళ్లీ ఓటర్ల జాబితా సవరణ

మహానగరంలోని కోటిన్నర మందికి అత్యవసరమైన సేవలందించే బల్దియాకు ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది.

Update: 2023-06-01 02:56 GMT

దిశ, సిటీబ్యూరో : మహానగరంలోని కోటిన్నర మందికి అత్యవసరమైన సేవలందించే బల్దియాకు ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిన ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు ఇప్పటికే రిపీటెడ్ ఓట్లను గురించి విధులను అప్పగించిన సంగతి తెలిసిందే. ఒక్కో ఇంటి నెంబర్‌పై నమోదై ఉన్న ఓటర్లవివరాలను క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేయటంలో ట్యాక్స్ సిబ్బంది బిజీగా ఉంది. దీనికి తోడు మళ్లీ ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మొదలుకావటంతో కొత్త ఓటర్ల నమోదు, తప్పొప్పులను సరిచేయటం వంటి విధుల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది బిజీగా ఉంది. దీనికి తోడు హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇదివరకే నియమితులైన ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ)లకు కూడా శిక్షణ ఇచ్చారు. వీరికి ట్యాక్స్, ఇతర విభాగాల సిబ్బంది ఓట్లు, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎలా వెరిఫై చేయాలన్న అంశంపై మంగళవారం శిక్షణ పూర్తి చేశారు. కానీ బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లకు అప్పగించిన రిపీటెడ్ ఓట్ల గుర్తింపు ప్రక్రియ సత్పలితాలనిస్తుందని అధికారులు చెబుతున్నారు.

ముషీరాబాద్ నియోజకవర్గంలొ ఒకే ఇంటి నెంబర్ పై సుమారు 70 నుంచి 80 ఓట్లు నమోదైనట్లు గుర్తించి, వాటిలో అసలైన ఓట్లను గుర్తించే ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. ఎలక్షన్ డ్యూటీలు అప్పగించిన మరికొందరు బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు తమకు కేటాయించిన ఏరియాలోని బీఆర్ఎస్, మజ్లీస్ నేతలను ఆశ్రయించి ఓటర్ల సమాచారాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు ఇదివరకు పోలింగ్ స్టేషన్‌గా వినియోగించిన భవనం కండీషన్, దానిలో మౌలిక వసతుల పరిస్థితులపై నివేదికలు ఇచ్చే బాధ్యతలను కూడా కలెక్షన్ స్టాఫ్‌కే అప్పగించినట్లు సమాచారం.

ఆన్ లైన్ కలెక్షన్ పైనే ఆశలు

బల్దియా ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ క్షేత్రస్థాయి కలెక్షన్‌కు అధికారులు పూర్తిగా బ్రేక్ వేశారనే చెప్పవచ్చు. కలెక్షన్ చేయాల్సిన సిబ్బందికి ఎలక్షన్ డ్యూటీలు అప్పగించటంతో పాటు ఖచ్చితంగా నిర్వహించేలా అల్టిమేటమ్ కూడా జారీ చేయటంతో సిబ్బంది తమకు కేటాయించిన ఏరియాల్లో ఎలక్షన్ డ్యూటీలు చేస్తున్నారు. మరీ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో జరిగే వసూళ్లపైనే అధికారులు ఆశలు పెట్టుకున్నారు. పైగా ఏప్రిల్‌లో ఎర్లీబర్డ్‌ను అమలు చేసి ఏకంగా రూ.780 కోట్లను వసూలు చేసుకున్న అధికారులు జూలైలో మళ్లీ మొండిబకాయిల వసూళ్ల చేయనున్నారు. దీని కోసం అమలు చేసే వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీం వచ్చే వరకు కలెక్షన్ స్టాఫ్‌ను ఎలక్షన్ డ్యూటీలకు వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇదీ ఎలక్షన్ స్టంటేనా?

జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలనవ్యవస్థను తీసుకువచ్చే ప్రక్రియను సర్కారు వేగవంతం చేయటం కూడా ఎలక్షన్ స్టంటేనా? అన్న చర్చ జరుగుతుంది. అధికారపార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలన్న అధిష్టానం ఆదేశాల మేరకు నగరంలో కూడా ప్రజల కోసం అధికార పార్టీ ఏదో చేస్తుందన్న ఆలోచనను ప్రజల్లో కల్పించేందుకే వార్డుల వారీగా పాలన వ్యసస్థకు తెరదీసినట్లు విమర్శలున్నాయి. కలెక్షన్ స్టాఫ్ ఎలక్షన్ డ్యూటీలు చేస్తుండగా, మిగిలిన వివిధ విభాగాల సిబ్బంది వార్డు ఆఫీసుల ఏర్పాటు, అందుకు కమ్యూనిటీ హాళ్ల గుర్తింపు వంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

Tags:    

Similar News