స్థానిక సంస్థల ఎన్నికల ప్రయత్నాలు స్టార్ట్.. సమన్వయంపై టీపీసీసీ ఫోకస్!

కాంగ్రెస్ లో స్థానిక సంస్థ ఎన్నికల టిక్కెట్ల పంచాయితీ మొదలైంది.

Update: 2024-06-10 02:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ లో స్థానిక సంస్థ ఎన్నికల టిక్కెట్ల పంచాయితీ మొదలైంది. లోకల్ బాడీ ఎన్నికల్లో తాము సూచించిన వ్యక్తులకే టిక్కెట్లు ఇవ్వాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీపై ప్రెజర్ పెడుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం తమ ఫాలోవర్స్ అద్భుతంగా పనిచేశారంటూ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల టిక్కెట్ల కోసం సిఫారసులు చేస్తున్నారు. కచ్చితంగా ఇవ్వాల్సిందేనంటూ టీపీసీసీపై గత రెండు రోజుల నుంచి ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు.

కొన్ని జిల్లాల డీసీసీలకు ఇప్పటికే కొన్ని అప్లికేషన్లు కూడా చేరినట్లు తెలిసింది. మరి కొంత మంది నేరుగా గాంధీభవన్ లోని టీపీసీసీ నేతలకు దరఖాస్తులు ఇస్తున్నట్లు సమాచారం. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి? క్రైటేరియా ఏమిటీ? దరఖాస్తు ప్రక్రియ ఎలా పెట్టాలి? అసెంబ్లీ, లోక్ సభ తరహాలోనే డిపాజిట్లు పెడదామా? అనే అంశాలపై టీపీసీసీ కసరత్తు మొదలు పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి తో కార్యవర్గ నిర్వహణ మీటింగ్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల టిక్కెట్ పై స్పష్టత వస్తుందని పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు.

గ్రూపులు..విభేదాలు...?

స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీలో గ్రూప్ లు ఏర్పడమే కాకుండా, నిర్ణయాలపై విభేదాలు పెరిగే ప్రమాదముంది. పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరుల కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో స్థానికంగా నేతల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుదన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించే ఆస్కారం ఉన్నట్టు పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. ఖమ్మంలో ప్రస్తుతం మంత్రులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రాజ్య సభ సభ్యురాలిగా పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి ఉన్నారు.

ఒకే జిల్లాలో ఇంత మంది నేతలు కీ పోస్టులో ఉండటంతో తమ అనుచరులకు టిక్కెట్లు ఇచ్చే క్రమంలో తప్పనిసరిగా విభేదాలు, వాగ్వాదాల చోటు చేసుకునే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నల్లగొండలోనూ సేమ్ సిచ్ వేషన్. ఈ జిల్లాలో మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డితో పాటు ఆయన కుటుంబంలో ఎంపీ, ఎమ్మెల్యేలుగా తన కుమారులు వర్క్ చేస్తున్నారు. వరంగల్ లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఉండగా, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది.

సీఎంకు అతి సన్నిహితుడిగా పేరు ఉండడంతో ఆయన మీద ఆధారపడే క్షేత్రస్థాయి నేతలు కూడా ఎక్కువగా ఉన్నారు. కరీంనగర్ లో మంత్రులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉండగా, మెదక్ లో మంత్రి దామోదర రాజనర్సింహా, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వంటి లీడర్లు ఉన్నారు. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ తో పాటు మంత్రి జూపల్లి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో మంత్రుల ప్రెజర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా తమ అనుచరుల కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇక వీళ్లతో పాటు మరి కొంత మంది నేతలు ఎంపీలు, రాష్ట్రంలో కీలక నాయకులతో సంప్రదింపులు జరిపి స్థానిక సంస్థల్లో టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో టిక్కెట్లకు పోటీ పెరిగిందిన్న చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది.

సమన్వయం ఎలా..?

పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు పోటీ పడుతుండగా, వారిని సమన్వయం ఎలా చేయాలంటూ టీపీసీసీ మల్లగుల్లాలు పడుతోంది. ఒకరిని కాదని మరో వర్గానికి టిక్కెట్లు కేటాయించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో? అని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్ టిక్కెట్ల పంపిణీ సమయంలో ప్రత్యేక కమిటీని వేసినట్లే, లోకల్ బాడీ ఎన్నికలకూ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది. ముందస్తుగానే చర్యలు తీసుకోకపోతే పార్టీలో విభేదాలు భగ్గుమనే ప్రమాదం ఉందని పార్టీ లో బిగ్ డిస్కషన్.


Similar News