Telangana Rains : వర్షాల ఎఫెక్ట్.. విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1912

విద్యుత్తు, నిత్యావ‌స‌ర స‌రుకుల సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Update: 2024-09-01 09:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యుత్తు, నిత్యావ‌స‌ర స‌రుకుల సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా గురించి క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్పీడీసీఎల్ సీఈలు, ఎస్ఈలు, డీఈలతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క‌ స‌మీక్షించించారు. విద్యుత్ అంతరాయం, పునరుద్ధరణపై ఎస్ఈ లతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు. వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం కలిగిన చోట పునరుద్ధరణకు కలెక్టర్, పోలీస్, రెవెన్యూ, జిల్లా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని సూచించారు. నీట మునిగిన సబ్ స్టేషన్లు, పిడుగులు పడి దెబ్బతిన్న చోట మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా వాటి పరిధిలో ఉన్న గ్రామాలకు పక్క సబ్ స్టేషన్ నుంచి విద్యుత్తును సరఫరా చేయాలన్నారు. 24/7 అలర్ట్‌గా ఉండి కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు అమలు చేయాలని తెలిపారు. విద్యుత్తు స్తంభాలు, విద్యుత్ వైరు, ట్రాన్స్ఫార్మర్లు మిగతా మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.

భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న నదులు, వాగుల వరద ఉధృతిపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ గా ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామన్నారు. విద్యుత్ అంతరాయానికి సంబంధించిన సమస్యల ప‌రిష్కారం కోసం విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు ప్ర‌జ‌లు ఏ క్ష‌ణ‌మైనా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజలనుంచి వచ్చిన సమస్యల‌ను పరిష్కరించడానికి కంట్రోల్ రూమ్ నుంచి నిత్యం పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగ ధర్మం కాకుండా సమాజ సేవా భావంతో పనిచేస్తున్నందుకు విద్యుత్ శాఖ సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు అని పేర్కొన్నారు.


Similar News