చికోటి విచారణకు డేట్ ఫిక్స్.. ఆ కేసులో ఉచ్చు బిగించేందుకు ఈడీ రెడీ..!

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్‌ను ఈ నెల 15న ఈడీ అధికారులు విచారించనున్నారు.

Update: 2023-05-12 10:07 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్‌ను ఈ నెల 15న ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇటీవల ఈడీ అధికారులు చీకోటికి నేపాల్ క్యాసినో కేసులో నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, పాత కేసులో నోటీసులు ఇచ్చినప్పటికీ ఇటీవల వెలుగు చూసిన పటాయా క్యాసినో వ్యవహారంపైనే ఈడీ అధికారులు విచారణ జరుపనున్నట్టు సమాచారం. ఇప్పటికే పటాయా పోలీసుల నుంచి కొంత సమాచారం సేకరించిన ఈడీ అధికారులు పబ్లిక్​డొమైన్‌లో ఉన్న సమాచారంతో చీకోటిని ప్రశ్నించనున్నట్టు తెలిసింది. థాయ్​లాండ్​దేశంలోని పటాయాలోని లగ్జరీ హోటల్​ఏషియాలో క్యాసినో నడుస్తోందన్న సమాచారంతో పటాయా పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో చీకోటి, దేవేందర్​రెడ్డి, మాధవరెడ్డి, సంపత్‌తో పాటు ఎనభై మూడు మంది భారతీయులు పట్టుబడ్డారు.

వీరితోపాటు థాయ్​లాండ్, మయన్మార్​పౌరులు కూడా అరెస్టయ్యారు. పటాయా పోలీసులు క్యాసినో నుంచి 20కోట్ల రూపాయల విలువ చేసే గేమింగ్​చిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, చీకోటి అతని సహచరులు క్యాసినో నిర్వహిస్తున్నట్టుగా ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో మరుసటి రోజే అందరూ కోర్టులో జరిమానాలు చెల్లించి విడుదలయ్యారు. కాగా, పటాయా పోలీసులు క్యాసినోలో తనిఖీలు జరిపినపుడు ఓ లాగ్​బుక్​దొరికింది. ప్రస్తుతం అదే కేసులో కీలక ఆధారంగా మారింది. లాగ్​బుక్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం అయిదు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల గ్యాంబ్లింగ్​జరిగినట్టు పటాయా పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది.

అయితే, పటాయా పోలీసులకు సంఘటనా స్థలంలో కేవలం లక్షా అరవై వేల రూపాయల భారత కరెన్సీ మాత్రమే దొరికింది. ఈ నేపథ్యంలో గ్యాంబ్లింగ్​ఆడటానికి మన దేశం నుంచి వెళ్లిన ఎనభై మూడు మంది వెళ్లటానికి ముందే ఇక్కడ పెద్ద పెద్ద మొత్తాలను తెలిసిన వ్యక్తుల దగ్గర డిపాజిట్​చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. పటాయాలో జరిగిన గ్యాంబ్లింగ్‌లో గెలిచిన వారికి ఓడిపోయిన వారు డిపాజిట్​చేసిన మొత్తాల్లో నుంచి చెల్లింపులు జరిపినట్టుగా తెలిసింది. ఇదంతా హవాలా రూపంలోనే జరిగినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మరోసారి నేపాల్​క్యాసినో కేసులో నిందితులుగా ఉన్న చీకోటిని ప్రశ్నించాలని నిర్ణయించినట్టు సమాచారం.

లగ్జరీ కార్లపై దృష్టి..

ఇదిలా ఉండగా ఈడీ అధికారులు చీకోటి వద్ద ఉన్న లగ్జరీ కార్లపై కూడా ఫోకస్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ కార్ల కొనుగోలుకు సంబంధించి చెల్లింపులు ఎలా జరిగాయి, చీకోటి తన పేరు మీద కొన్నాడా, బినామీ పేర్లతో కొన్నాడా? అన్న దానిపై ఆరా తీయనున్నట్టు సమాచారం.

Tags:    

Similar News